ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నాడు.. మంత్రి కేటీఆర్, డీజీపీకి ట్వీట్‌

8 Aug, 2022 11:07 IST|Sakshi

సాక్షి, తిరుమలగిరి(నాగార్జునసాగర్‌) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించడంతో పాటు అకారణంగా కొట్టాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే ప్రాంతానికి చెందిన బాధితుడి సోదరుడు మంత్రి కేటీఆర్‌తో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న తదితరులకు ట్వీట్‌ చేశాడు. దీంతో పాటు డయల్‌ 100కూ ఫిర్యాదు చేశాడు. ఇదే విషయంపై తిరుమలగిరి (సాగర్‌) పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబులతో బాధితుడి సోదరుడి ఫోన్‌ సంభాషణ ఆడియోతో పాటు ఎస్‌ఐ ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అందులోని సారాంశం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  తిరుమలగిరి మండలం నేతాపురం గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వర్లు భార్యతో కలిసి శనివారం సాయంత్రం  బైక్‌పై హాలియా నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు.  వీరు తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ వద్దకు రాగానే స్థానిక ఎస్‌ఐ పెదపంగ బాబు వాహనాల తనిఖీలో భాగంగా వెంకటేశ్వర్లు బైక్‌ను నిలిపాడు. వాహనానికి బీమా లేకపోవడంతో రూ. 100 జరిమానా విధిస్తూ బైక్‌ తీసుకున్నాడు. చలానా చెల్లించిన తర్వాత బైక్‌ తిరిగి ఇస్తానని చెప్పాడు. దీంతో వెంకటేశ్వర్లు సమీపంలోని ఓ ఆన్‌లైన్‌ కేంద్రంలో చలానా చెల్లించి రషీదును ఎస్‌ఐకి చూపించి బైక్‌ ఇవ్వాలని కోరాడు.

చలానా చెల్లించిన తర్వాత కూడా బైక్‌ను సీజ్‌ చేసే నిబంధనలు వచ్చాయని పోలీసులు వెంకటేశ్వర్లును హెచ్చరించారు. చలానా చెల్లించిన తర్వాత ఏ విధంగా సీజ్‌ చేస్తారని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా ఎస్‌ఐ బాబు అతడిపై చేయి చేసుకున్నాడు. అనంతరం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన తర్వాత స్టేషన్‌ వద్ద జరిగిన విషయాన్ని తన సోదరుడు శ్రీనివాస్‌కు వివరించాడు. వెంటనే శ్రీనివాస్‌ నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు. అనంతరం డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. ఆపై పోలీసుల తీరును వివరిస్తూ మంత్రితో పాటు తదితరులకు ట్వీట్‌ చేశాడు.  

అట్రాసిటీ కేసు పెడతా..
తాను ఎవరినీ దూషించలేదు, కొట్టలేదు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అలా ప్రవర్తించినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు అతడిపై అట్రాసిటీ కేసు పెడతా. నేను ఓ వ్యక్తిని కొట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అప్పట్లో అతడిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది.
– ఎస్‌ఐ పెదపంగు బాబు, తిరుమలగిరి 

ఎస్పీకి బాధితుడి సోదరుడు చేసిన ట్వీట్‌ 

మరిన్ని వార్తలు