మిల్లర్ల నిర్లక్ష్యం.. సర్కార్‌పై రూ.1,257 కోట్ల భారం 

5 Mar, 2023 01:47 IST|Sakshi

ఎఫ్‌సీఐకి 3.93 ఎల్‌ఎంటీ మేర  బియ్యం అప్పగించని మిల్లర్లు

2021–22 ఖరీఫ్‌ సీజన్‌కు గత నెలతో ముగిసిన సీఎంఆర్‌ గడువు 

2021–22 యాసంగి సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకే చాన్స్‌

ఈ సీజన్‌లో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం 12.61 ఎల్‌ఎంటీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్‌ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్‌ టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్‌సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది.  

47.04 ఎల్‌ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్‌ఎంటీ.. 
2021–22 వానకాలం సీజన్‌కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి 47.04 ఎల్‌ఎంటీ బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌గా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు.

ఇంకా 3.93 లక్షల మెట్రిక్‌ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌ పూల్‌ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్‌ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది.  

2021–22 యాసంగి సీఎంఆర్‌కు  ఈనెలాఖరు వరకు గడువు 
గత 2021–22 యాసంగి సీజన్‌కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్‌ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్‌ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు.

గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్‌ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్‌ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్‌ఎంటీ బియ్యం పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లింగ్‌ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ శనివారం అధికారులను ఆదేశించారు.

గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్‌లో 14 ఎల్‌ఎంటీ మేర బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్‌ఎంటీ బాయిల్డ్‌ రైస్‌ పెండింగ్‌లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో సీఎంఆర్‌ పెండింగ్‌ అధికంగా ఉండటంపట్ల రవీందర్‌ సింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు