సమాధుల పక్కన ఆడశిశువు

9 Mar, 2021 08:27 IST|Sakshi

వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

ఏడుపు విని అక్కున చేర్చుకున్న మహిళ

శిశు గృహానికి తరలించిన అధికారులు

డోర్నకల్‌: మహిళా దినోత్సవం రోజున మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బూరుగుపాడు గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపాన సమాధుల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పాలిథిన్‌ కవర్‌ చుట్టి ఉన్న పసికందు ఏడుపు విని సమీపంలో ఉన్న మహిళ అక్కడకు వెళ్లడంతో శిశువు కనిపించింది. బూరుగుపాడుకు చెందిన వేల్పుల వెంకటమ్మ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాకరకాయల కోసం దర్గా ప్రాంతానికి వెళ్లగా పసికందు ఏడుపు వినిపించింది. పక్కనే పరిశీలించగా అక్కడి సమాధుల పక్కన కవర్‌లో ఆడశిశువు కనిపించింది.

సమీపంలో ఎవరూ లేకపోవడంతో పసికందును ఆమె ఇంటికి తీసుకొచ్చింది. బొడ్డు పేగు, శరీరానికి రక్తం ఉండటంతో స్నానం చేయించిన తర్వాత పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలకు సమాచారం అందించింది. వారు వెంకటమ్మ ఇంటికి వచ్చి పసికందును పరిశీలించి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకున్న తరువాత ఏఎన్‌ఎం సరస్వతి, అంగన్‌వాడీ కార్యకర్త హైమావతి, ఆశ కార్యకర్త సులోచన పసికందును డోర్నకల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు పాపను వార్మర్‌లో ఉంచారు. 2.5 కేజీల బరువుతో పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బాలల హక్కుల కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు బృందాధర్‌రావు, సీడీపీఓ ఇందిర, బాల రక్ష భవన్‌ కో–ఆర్డినేటర్‌ జ్యోతి, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి నరేశ్వై‌,ద్యాధికారి డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, వైద్యురాలు డాక్టర్‌ విరాజిత తదితరులు ఆస్పత్రిలో పసికందును పరిశీలించారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ప్రతినిధులు పసికందును మహబూబాబాద్‌ శిశుగృహానికి తరలించారు.

చదవండి: 20 ఏళ్ల క్రితమే అక్కడ మహిళా రాజ్యం

మరిన్ని వార్తలు