కొలిక్కిరాని ‘విభజన’ సమస్యలు

28 Sep, 2022 05:33 IST|Sakshi

సమస్యల పరిష్కారం దిశగా పడని ముందడుగు

ఫలితమివ్వని ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్రం భేటీ

కోర్టు కేసులు, విభేదాల నేపథ్యంలో చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు మరోసారి కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం పెద్దగా ఫలితమివ్వకుండానే ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలపాటు ఈ భేటీలో చర్చించగా రెండు రాష్ట్రాలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. 

కేంద్ర హోంశాఖ జోక్యం వద్దు..
షెడ్యూల్‌–9లోని సంస్థల విభజనలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికార పరిధి లేదని పాడిపరిశ్రమల సంస్థ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని సమావేశంలో తెలంగాణ గుర్తు చేసింది. షెడ్యూల్‌–9లో 91 సంస్థలుండగా 90 సంస్థల విభజనపై షీలా బిడే కమి టీ చేసిన సిఫారసులన్నింటినీ అంగీకరించాలని ఏపీ కోరింది. అయితే కేసులు తేలే వరకు నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది.

తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (దిల్‌) ఆస్తుల విభజనకు షీలా బిడే కమిటీ సిఫారసులు చేసిందని తెలంగాణ తప్పుబట్టింది. ‘దిల్‌’భూములను తెలంగాణ స్వాదీనం చేసుకోవడాన్ని ఏపీ సవాల్‌ చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేసింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ భూముల కేసు తేలాకే ఆ సంస్థను విభజించాలని తెలంగాణ స్పష్టం చేసింది. కోర్టు కేసులపై పరిశీలన జరపాలని కేంద్ర హోంశాఖను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. 

నగదు నిల్వల పంపకాలపై తెలంగాణ ఓకే.. 
ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా షెడ్యూల్‌–10లోని సంస్థల నగదు నిల్వల పంపకాలను జనాభా దామాషా ప్రకారం జరపాలని కేంద్రం ఉత్తర్వులకు తెలంగాణ మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టులో ఏపీ వేసిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది.

సింగరేణి సంస్థను విభజించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51% వాటాను తమకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపర్చిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆప్మెల్‌’నే విభజించాల్సి ఉందని స్పష్టం చేసింది. బియ్యం సబ్సిడీల్లో తెలంగాణ వాటా బకాయిలను ఏపీ చెల్లిస్తే ఏపీ పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ తీసుకున్న రూ. 354 కోట్ల రుణాలను చెల్లించడానికి తెలంగాణ అంగీకరించింది.

విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. నగదు, బ్యాంకుల్లో నిల్వల విభజన విషయంలో ‘కాగ్‌’సహకారం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. పన్నుల్లో తేడాల నిర్మూలనకు విభజన చట్ట సవరణ జరపాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది.  

గిరిజన వర్సిటీ, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించండి... 
తెలంగాణ విజ్ఞప్తులకు స్పందిస్తూ విభజన హామీలైన గిరిజన వర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్య, రైల్వే శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వెనుబడిన జిల్లాల అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సునీల్‌ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు