మద్యం మత్తులో వాహనం.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

6 Feb, 2021 08:32 IST|Sakshi

తొలిసారిగా ట్రాఫిక్‌ పోలీసుల జారీ

ఐదు రోజుల జైలు, జరిమానా విధించిన కోర్టు 

సాక్షి, హైదరాబాద్‌ : న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల్లో చిక్కి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘నిషా’చరుడు సయ్యద్‌ అమీరుద్దీన్‌కి నాంపల్లి కోర్టు షాక్‌ ఇచ్చింది. అతనిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసి అరెస్టు చేయించింది. చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆ నిందితుడిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమీరుద్దీన్‌కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఓ మందుబాబుపై ఎన్‌బీడబ్ల్యూ జారీ కావడంతో ట్రాఫిక్‌ పోలీసుల చరిత్రలో తొలిసారని చార్మినార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 31 రాత్రిని జీరో యాక్సిడెంట్‌ నైట్‌గా చేయడానికి సిటీ ట్రాఫిక్‌ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంబర్‌పేటకు చెందిన ప్లంబర్‌ సయ్యద్‌ అమీరుద్దీన్‌ మద్యం తాగి యాక్టివా వాహనంపై వస్తూ చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు.

బ్రీత్‌ అనలైజర్‌ యంత్రంతో పరీక్షించిన నేపథ్యంలో బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) 141గా తేలింది. ఈ కౌంట్‌ 30 దాటితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో చార్మినార్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, వివరాలు నమోదు చేసుకుని, వాహనం స్వాధీనం చేసుకుని పంపారు. ఇలా చిక్కిన మందుబాబులు నిర్ణీత తేదీల్లో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఆపై కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్ష పూర్తి చేయడం లేదా జరిమానా కట్టడం చేసిన తర్వాత తమ వాహనం తీసుకువెళ్లాలి. అయితే అమీరుద్దీన్‌ మాత్రం కౌన్సెలింగ్‌కు, కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో చార్మినార్‌ పోలీసులు అతడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీని ఆధారంగా కోర్టు అమీరుద్దీన్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసినా అతను బేఖాతరు చేశాడు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. 

మరిన్ని వార్తలు