ప్రాణహాని ఉంటేనే సిజేరియన్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు

15 Jul, 2022 08:19 IST|Sakshi

సాధారణ కాన్పులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో పెరుగుతున్న సాధారణ ప్రసవాల సంఖ్య

కడుపు కోతలకు చెక్‌ పెట్టడంలో ఫలిస్తున్న చర్యలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్‌ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్‌ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్‌ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్‌ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు.

ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది.

వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్‌ డెలివరీలే జరుగుతున్నాయి.

నార్మల్‌ డెలివరీ కావడం సంతోషంగా ఉంది
నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్‌ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్‌ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్‌ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్‌ కిట్‌ కూడా ఇచ్చారు.
– పద్మ, బాలింత, నర్మెట

నిర్మల్‌ ప్రభుత్వాస్పత్రిలో..
గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్‌ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్‌ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు.

పడవలో వాగు దాటించారు
పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్‌లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్‌ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

ముందుజాగ్రత్త చర్యగా..
భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్‌ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్‌ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది.

చదవండి: నూతన జోనల్‌ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు 

మరిన్ని వార్తలు