యాసంగిలో  10 లక్షల ఎకరాల్లోనే!

1 Dec, 2021 04:05 IST|Sakshi

యాసంగి సాగుపై వ్యవసాయ శాఖ అంచనా 

ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత, రాష్ట్ర ప్రభుత్వ సూచన నేపథ్యం

విత్తనం, ఆహార అవసరాలకే పండించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఈ యాసంగిలో వరి పది లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. విత్తనం, ఆహార అవసరాలు, మిల్లర్లతో ఇప్ప టికే ఉన్న ఒప్పందం నేపథ్యంలో ఈ మేరకు సాగు జరిగే అవకాశం ఉందని అంటున్నాయి. కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని తేల్చి చెప్పడం.. యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ వర్గాలు ఈ అంచనాకు వచ్చాయి.

అవసరాల మేరకు మినహా ఇతరత్రా సాగు పెద్దగా జరగకపోవచ్చని భావిస్తున్నాయి. వరికి బదులు ప్రత్యామ్నాయ పం టల దిశగా రాష్ట్ర రైతులు ముందుకు వెళ్తున్నా రని చెబుతున్నాయి. సీఎం కేసీఆర్‌ వరిసాగు విషయంలో తాజాగా మరోసారి స్పష్టత ఇవ్వడంతో.. మరోసారి వరి వేయొద్దంటూ రైతులకు చెప్పేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది.  

గతేడాది ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో..: యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు. అయితే గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఈ వారంలో వరినాట్లు మొదలుకానున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రైతులు వరి తగ్గిస్తారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. కానీ వరి కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు రిస్క్‌ తీసుకోకపోవచ్చని అంటున్నారు.

అదే సమయంలో సాగునీరు పూర్తిస్థాయి లో అందుబాటులో ఉండటం, ప్రతి పక్షాలు వరి కొనాల్సిందేనని సర్కారుపై ఒత్తిడి పెంచుతుండటంతో.. రైతులు ఏవిధంగా ముందుకు వెళతారన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రత్యామ్నాయ పంటల సాగు ఇప్పటికే పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.  

భారీగా మినుము సాగు: యాసంగిలో మినుము ఎక్కువగా సాగవుతోంది. మినుము సాధారణ సాగు విస్తీర్ణం 24,018 ఎకరాలు కాగా, ఇప్పటికే 54,331 ఎకరాల్లో సాగవడం గమనార్హం. అంటే ఏకంగా 225 శాతం ఎక్కువగా ఈ పంట సాగైందన్నమాట. అది 70 వేల ఎకరాలకు చేరు కోవచ్చని అంటున్నారు. కేంద్రం కూడా మినుము సాగు పెం చాలని చెప్పడం, మద్దతుధర కంటే మార్కెట్లో ఉన్న ధర ఎక్కువుంటే అంతే ధర పెట్టి రైతుల వద్ద కొనా లని సూచించడంతో ఈ పంట వైపు వెళ్తున్నారని చెబుతున్నారు. మరోవైపు కుసుమ సాగు కూడా పెరిగింది. దీని సాధారణ సాగు విస్తీర్ణం 7,609 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8,459 (111%) ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ తెలిపింది.  

ఇతర పంటల సాగు ఇలా.. 
శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.47 లక్షల (87%) ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.80 లక్షల (93%) ఎకరాల్లో సాగయ్యింది. మొక్కజొన్న ఇప్పటివరకు 81,640 (19%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు), జొన్న 22,206 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 75,274 ఎకరాలు), పెసర 7,090 (33%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు) సాగయ్యింది. విత్తనాల కొరత కారణంగా పొద్దు తిరుగుడు విస్తీర్ణం పెరగకపోవచ్చని అంటున్నారు. ఈ పంట ఇప్పటివరకు 3,320 (30%) ఎకరాల్లో (సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు) సాగయ్యింది.  

మరిన్ని వార్తలు