రెండు కేసులకే పీడీ యాక్ట్‌ సరికాదు: హైకోర్టు 

29 Jan, 2023 03:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్వేషాలు రెచ్చగొట్టాడంటూ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసిన కేసులో ఆ వ్యక్తిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టులు పెట్టొద్దంటూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని అతనికి పలు షరతులు విధించింది. హైదరాబాద్‌ మలక్‌పేటకు చెందిన సయ్యద్‌ అబ్దహు ఖాద్రీ.. రాజాసింగ్‌ అరెస్టు, విడుదల సందర్భంగా సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ పలు కేసులు నమోదయ్యాయి.

దీంతో అతనిపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి నిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యను నిరసిస్తూ అతని తల్లి గజాలా హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం రిట్‌ పిటిషన్‌ను అనుమతించింది. కేవలం రెండు కేసుల ఆధారంగా పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. నిర్బంధంలో ఉంచాలంటూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.  

మరిన్ని వార్తలు