పెట్రో మంటలు..! 10 నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల 

2 Nov, 2021 02:01 IST|Sakshi

ధరల భారంతో సగటు జీవికి చుక్కలు..

నెలలో లీటర్‌పై రూ.8కి పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

విలవిల్లాడుతున్న వాహనదారులు 

ప్రతి నెలా రూ. వందల కోట్ల భారం 

10% నుంచి 15% వరకు పెరిగిన సరుకు రవాణా చార్జీలు 

నిత్యావసరాలతో పాటు అన్నిరకాల వస్తువుల ధరలపై ప్రభావం 

ప్రతి కిరాణా వస్తువు ధరలో కిలోకు రూ.1 నుంచి రూ.2 పెరుగుదల 

రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల వాహనాలు 

అందులో సరుకు రవాణా వాహనాలు 3.73 లక్షలు 

సాక్షి, హైదరాబాద్‌:  పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నెల రోజుల్లో లీటర్‌కు రూ.8కి పైగా పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విధంగా చమురు ధరలు పెరగడం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి స్తోంది. వాహనదారులకు చుక్కలు కనబడుతుంటే.. నానాటికీ పెరుగుతున్న డీజిల్‌ ధరలు పరోక్షంగా నిత్యావసరా ల రేట్లు పెరిగేందుకు దోహదపడుతున్నా యి. సరుకు రవాణా చార్జీలు 10% నుంచి 15% వరకు పెరగడంతో నూనెలు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాలతో పాటు అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగిపోతున్నాయి. 

15 రోజులకు బదులు రోజూ.. 
మే 2017 వరకు ప్రతి 15 రోజులకు పెట్రో ధరలను సవరించేవారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం (అంతర్జాతీయ సర్దుబాట్లు పేరిట) నేపథ్యంలో ఆ ఏడాది జూన్‌ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించడం మొదలుపెట్టారు. 2019 చివరి వరకు కొంత అటు ఇటుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు 2020 నుంచి హెచ్చు తగ్గులకు లోనవడం ప్రారంభం అయ్యింది. ఇక 2021 జనవరి నుంచి మొత్తం మీద పెరుగుదలే కొనసాగింది. ఈ ఏడాది జనవరి 1న హైదరాబాద్‌లో రూ.87.06 గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర నవంబర్‌1 వ తేదీ నాటికి రూ.114.12కు పెరిగింది. అదే సమయంలో లీటర్‌ డీజిల్‌ రూ. 80.60 నుంచి రూ.107.40కి చేరింది. అంటే రెండిటి ధరల్లో పది నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల చోటు చేసుకుందన్నమాట. 

సెంచరీ దాటి దూసుకుపోతూ.. 
    కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 8.32 పైసలు,  డీజిల్‌పై 9. 51 పైసలు పెరిగాయి. తర్వాత రెండు నెలలు లీటర్‌ పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై రూ.92 పైసలు మేరకు తగ్గాయి. ఆ తర్వాత వరసగా పెరుగుతూనే వచ్చాయి. జూన్‌లో లీటర్‌ పెట్రోల్‌ వంద రూపాయల మార్కును దాటగా... డీజిల్‌ అక్టోబర్‌ నెలలో సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటు డీజిల్‌ వినియోగం 25 కోట్ల లీటర్ల మేర ఉంటోంది. ఈ లెక్కన నెలకు వినియోగదారులపై రూ. వందల కోట్ల భారం పడుతోంది. జనవరి నుంచి 10 నెలల్లో వేల కోట్ల భారం పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

రూ.200కు చేరువలో వంట నూనెలు 
    పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసరాల ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి. పాలు, పెరుగు, బియ్యం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్‌కు రూ.200 మార్కుకు దగ్గరగా ఉన్నాయి. అనేక పప్పుల ధరలు కిలో రూ.150కి పైగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, టమాట, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల ధరలు కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలుకుతున్నాయి. ప్రతి కిరాణ వస్తువు మీద కిలోకు రూ. 1 నుంచి రూ. 2 వరకు వరకు ధరలను పెంచినట్లు హైదరాబాద్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సరకు రవాణా చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచారని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పారు. రవాణా చార్జీలు పెరగడంతో నిత్యావసరాలతో పాటు ఇతర అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.40 కోట్ల వాహనాలు ఉండగా... అందులో సరుకు రవాణా వాహనాల సంఖ్య 3.73 లక్షలు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ఇతర సరుకులు, వస్తువులు, సామగ్రి తెచ్చే వేలసంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పెరిగిన డీజిల్‌ ధరల ప్రభావం అన్ని రకాల సరుకులపై పడుతోంది 

వాహన ప్రయాణం భారం 
    రాష్ట్రంలోని 1.40 కోట్ల వాహనాలలో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. టూ వీలర్ల ద్వారానే ప్రతిరోజు కోటి లీటర్లకు పైగా పెట్రోల్‌ వినియోగం అవుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క లీటర్‌పైనే రూ.26కు పైగా పెరిగిందంటే 11 నెలల కాలంలో ఎంత మేర భారం పడిందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై వెళ్లడానికే భయపడే పరిస్థితి నెలకొంది. 

జీఎస్టీనే పరిష్కారమైనా.. 
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పెట్రోలియం సంస్థలు ధరలను పెంచుతుండగా, ఆ మొత్తానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను సవరిస్తున్నాయి. కేంద్రం పెట్రోల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ పేరిట ఏకంగా రూ.39.27 మేర పన్నుల భారం వేస్తుండగా, రాష్ట్రం వ్యాట్‌ రూపేణా మరో రూ.26.29 వసూలు చేస్తోంది. ఈ పన్నుల కారణంగానే ధరలు అమాంతంగా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఏడాదికి పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ రూపేణా సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆదాయం వస్తోంది. రెండు నెలలుగా భారీగా పెరుగుతున్న చమురు ధరలతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. కొన్ని రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకున్నా, మన రాష్ట్రం మాత్రం పన్నులను తగ్గించలేదు. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగిరావాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని చెబుతున్నా... చమురు, మద్యంపై హక్కును వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు.   

 2021 జనవరి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్‌ ధరలు (లీటర్‌కు) ఇలా.. 
–––––––––––––––– 
నెల        పెట్రోల్‌        డీజిల్‌ 
–––––––––––––––––––––––– 
నవంబర్‌         114.12        107.40 
అక్టోబర్‌        106.00        98.39 
సెప్టెంబర్‌        105.40        96.84 
ఆగస్టు            105.83        97.96 
జూలై        102.69         97.20 
జూన్‌        98,20        93.08 
మే            93.99        88.05 
ఏప్రిల్‌        94.16        88.20 
మార్చి        94.79        88.86 
ఫిబ్రవరి        89.77        83.46 
జనవరి        87.06        80.60 
 
– రాష్ట్రంలో పెట్రోల్‌ వినియోగం నెలకు సగటున: 15 కోట్ల లీటర్లు 
– జనవరితో పోలిస్తే నవంబర్‌ నాటికి వినియోగదారులపై పడిన భారం సుమారుగా రూ.405.9 కోట్లు 
– సగటు డీజిల్‌ వినియోగం : 25 కోట్ల లీటర్లు 
– వినియోగదారులపై పడిన భారం రూ.676.5 కోట్లు   

అన్ని వర్గాలపై ప్రభావం 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. డీజిల్‌ ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో సరుకు రవాణా చార్జీలు ఆకాశన్నంటాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి.  
– డి.పాపారావు, ఆర్థికరంగ నిపుణుడు  

మరిన్ని వార్తలు