మోదీ పర్యటన మళ్లీ వాయిదా!

11 Feb, 2023 02:49 IST|Sakshi

రాష్ట్రానికి గత నెల 19న, ఈ నెల 13న ప్రధాని వస్తారంటూ బీజేపీ నేతల ప్రచారం 

పీఎంవో నుంచి అధికారికంగా ఖరారు కాకముందే 

పోటాపోటీగా రాష్ట్ర పార్టీ నేతల అత్యుత్సాహం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అధికారికంగా ఖరారు కాకముందే బీజేపీ నేతలు అత్యుత్సాహంతో పోటాపోటీగా ప్రకటించడం.. ఆనక వాయిదా పడటం రివాజుగా మారిందన్న చర్చ పార్టీలో సాగుతోంది. గతనెల 19న సికింద్రాబాద్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారని, పరేడ్‌గ్రౌండ్స్‌ బహిరంగసభలో రైలు, రోడ్డు ప్రాజెక్ట్‌లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం వంటివి చేస్తారని బీజేపీ నేతలు నానా హడావుడి చేశారు.

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు పీఎంవో నుంచి సమాచారం లేకపోయినా సికింద్రాబాద్‌ జీఎం కార్యాలయానికి వెళ్లి వారితో పార్టీ నేతలు సమీక్ష నిర్వహించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ సందర్శించి బహిరంగసభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించేశారు. తీరా ఈ కార్యక్రమం వాయిదా పడడంతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మోదీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 

మళ్లీ ఈనెల ఫిబ్రవరి 13న మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటూ అధికారిక కార్యక్రమం ఖరారు కాకుండానే బీజేపీ నేతలు మరోసారి హడావుడి చేశారు. ఈ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారమేది ఇంకా అధికారికంగా రాలేదని స్పష్టం చేశారు. చివరకు ఈ కార్యక్రమం కూడా వాయిదా పడినట్టు ఇప్పుడు పార్టీనాయకులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 10వ తేదీన శుక్రవారం మొదలైన ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’కార్యక్రమం ఈనెల 25వరకు జరగనుంది. ఆ కార్యక్రమం పేరిట 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11వేల వీధిచివర సమావేశాలు (స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్స్‌) నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, సంస్థాగతంగా ఏ మేరకు బలోపేతమైందన్న దానిని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని 11 వేల శక్తి కేంద్రాల్లో (3,4 పోలింగ్‌బూత్‌లు కలిపి ఓ కేంద్రం) ప్రజాగోస స్ట్రీట్‌కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీని ఈ కార్యక్రమ రూపకర్త, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి , రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రధాని మోదీ సహా ఇతర ముఖ్యనేతల అధికారిక పర్యటనలు వాయిదాపడ్డాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదట్లో ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించి అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. 

మరిన్ని వార్తలు