Pocharam Wildlife Sanctuary: అందాలు అదరహో

2 Nov, 2021 21:26 IST|Sakshi

ఉరకలు వేసే వన్యప్రాణులు

అహ్లాదం పంచే పచ్చటి వాతావరణం

పిల్లలకు ఆటవిడుపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

మెదక్‌: చెంగుచెంగున దుంకే కృష్ణ జింకలు.. పురివిప్పి నాట్యం చేసె నెమళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. చుట్టూ కనుచూపు మేరకు పరుచుకున్న పచ్చదనం.. ఇలా పోచారం అభయారణ్యం అందాలు కనువిందు చేస్తున్నాయి. అభయారణ్యానికి అనుకుని ఉన్న పోచారం ప్రాజెక్టుతో అక్కడికి వెళుతున్న సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మెదక్‌ జిల్లా కేంద్రానికి కేవలం 15కిలోమీటర్ల దూరంలోని మెదక్‌-బోధన్‌ రహదారికి అనుకుని ఉంది. ఈ పోచారం అభయారణ్యం.

రాష్ట్ర రాజధానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రతిరోజు పెద్ద సంఖ్య సందర్శకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. వారాంతాల్లో ఈ సందర్శకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బోధన్‌ ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తుంటారు

నీల్‌గాయిలు.. కొండగొర్లు..
ఈ అభయారణ్యంలో చుక్కలజింకలు, సాంబార్లు, నీల్‌గాయిలు, గడ్డిజింకలు, నెమళ్లు, అడవిపందులు, కొండగొర్లతో పాటు అనేక రకాల పక్షులు దర్శనమిస్తుంటాయి. ఈ అడవి 164 హెక్టార్ల మేర ఉండగా దాన్ని చుట్టూ కంచె వేశారు. ఆ కంచె లోపల జంతువులను పెంచుతున్నారు. అడవిలోని జంతువులను తిలకించేందుకు 4.5 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి వెంట వెళ్తే అడవిలోని జంతువులను తిలకించవచ్చు. అరణ్యంలోని కారు, జీపు లాంటి వాహనాలపై వెళ్లవచ్చు.

అభయారణ్యంలోకి ప్రవేశించగానే ఈ వన్యప్రాణులు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అటవీ అందాలను వీక్షించేందుకు మూడు వాచ్‌ టవర్లు నిర్మించారు. వాటి పైకి ఎక్కి చూస్తే కనుచూపు మేరలో పచ్చటి అందాలు మన కళ్లకు దర్శనమిస్తాయి. అభయారణ్యం వద్ద గేస్ట్‌హౌజ్‌ ప్రాంగణంలో  పక్కన చిన్నపిల్లల ఆటవిడుపు కోసం రకరకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. 

పోచారం ప్రాజెక్టు..
ఈ అభయారణ్యం ఆనుకుని చుట్టూ కొండల మధ్య పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండుకుండలా నీటితో కళకళలాడుతుంది. ఈ ప్రాజెక్టులో బోటు శికారు చేస్తూ సందర్శకులు అహాల్లాదాన్ని పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు చుట్టూ పచ్చని చెట్లు నిజాం పాలనలో నిర్మించిన ఐబీ అతిథిగృహం ఉంది.

మరిన్ని వార్తలు