‘పోడు’పై తెగని పంచాయితీ!

19 Jul, 2022 02:07 IST|Sakshi

అపరిష్కృతంగా పోడు భూములకు హక్కుల కల్పన సమస్య

12.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న సుమారు 3,95,000 మంది

దరఖాస్తుల స్వీకరణతోనే ఆగిన ప్రక్రియ

ఆటంకంగా మారిన అటవీ హక్కుల చట్టంలోని కఠిన నిబంధనలు

సవరణల కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాల విజ్ఞప్తికి కేంద్రం నో

సాక్షి, హైదరాబాద్‌: పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీకి విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఈ క్రమంలో అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాల్లోని 3,041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు తేలింది.

ఇందులో 62 శాతం గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొంతమందికి హక్కులు దక్కలేదు. మరోవైపు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండిపోయింది.

చట్ట సవరణతోనే సాధ్యం!
అటవీ శాఖ భూములపై హక్కులు కల్పించే అటవీ హక్కుల చట్టం– 2006 లో అనేక కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలే సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారాయని, ఈ చట్ట సవరణ ద్వారానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమనే అభిప్రాయం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్‌ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రమే ఆయా భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉంది.

ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ తేదీ నాటికి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇక గిరిజనేతరులు తాము 75 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తగిన ఆధారాలను చూపిస్తే వారికి హక్కులు దక్కేలా అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారుచేసింది. అయితే 75 ఏళ్ల పోడుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించే అవకాశాలు లేకపోవడంతో గిరిజనేతరులకు ఈ భూములపై హక్కులు దక్కడం లేదనే అభిప్రాయం గట్టిగా ఉంది. 

అంతా కేంద్రం చేతిలోనే..!
ప్రస్తుతం తెలంగాణలో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే 2006 నాటి చట్టంలో ఉన్న డిసెంబర్‌ 2005 కట్‌ ఆఫ్‌ తేదీని మార్చాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనేతరులకు పోడు హక్కులు దక్కాలంటే, వారు 75 ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను చూపించాలన్న నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో..దరఖాస్తులు స్వీకరించినా, అర్హులైన పోడు రైతుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అవకాశం లేకుండా పోయిందనే వాదనను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి.

మినహాయింపులకు అవకాశం లేదు..
అటవీ హక్కుల చట్టానికి కొన్ని సవరణలు చేసి పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఒక లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ కేసీఆర్‌కు కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టానికి మినహాయింపులు ఇస్తే, గిరిజనులతో పాటు అటవీ సంరక్షణకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘పోడు’మింగుడు పడని సమస్యగా మారింది.  

మరిన్ని వార్తలు