కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్‌ డాగ్‌ ప్రధాన పాత్ర

2 Mar, 2023 15:32 IST|Sakshi

కొండగట్టు చోరీ కేసును చేదించిన పోలీసులు

కర్ణాటక రాష్ట్రం బీదర్ లో దొంగలను పట్టుకున్న జగిత్యాల పోలీసులు 

తాగి పారేసిన బీరు సీసాలు గుర్తించిన పోలీసు డాగ్

వేలి ముద్రల ఆధారంగా కర్ణాటక బీదర్ లోని దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

మోటార్ సైకిళ్లపై వచ్చి చోరీ

భక్తుల వేషధారణలో ఆలయంలో అంజన్న దర్శనం.. ఆ తర్వాత రెక్కీ

మొత్తం దొంగలు ఏడుగురు.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు 

5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

దొంగలు అంతా రక్త సంబంధీకులే

ముఠాగా ఏర్పడి ఆలయాలే టార్గెట్‌గా చోరీలు

సాక్షి, కరీంనగర్‌: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్  కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు.

దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది.

స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై  అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ,  వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి..

పోలీస్‌ డాగ్‌ది ప్రధాన పాత్ర
కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు.

దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల  ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం.

ఏడుగురూ రక్త సంబంధీకులే
కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం.

24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు
కొండగట్టు చోరీ కేసును చాలెంజ్‌గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు