ఆంక్షల నడుమ సీఎల్పీ బృందం పర్యటన 

17 Aug, 2022 01:12 IST|Sakshi
ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో రాత్రి 11గంటలకు వేచి ఉన్న  సీతక్క, భట్టి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి  

భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు 

సినీఫక్కీలో చేజింగ్‌చేసి ఎక్కడికక్కడ కాన్వాయ్‌ మళ్లింపు 

రాత్రి 11 వరకు నేతల పడిగాపులు 

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలోని ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష(సీఎల్‌పీ) బృందం పర్యటనకు అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురయ్యాయి. ముంపు బాధితుల పరామర్శకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వాన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, సీతక్క, కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులతో కూడిన బృందం మంగళవారం వచ్చింది.

భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నాక స్థానికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు గోదావరి వరద పెరుగుతున్నందున దుమ్ముగూడెం పర్యటన వాయిదా వేసుకోవాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ కోరినా నేతలు ససేమిరా అన్నారు.

దీంతో పోలీసుల కళ్లుగప్పి సీఎల్పీ నేతల కాన్వాయ్‌ దుమ్ముగూడెం మండలం వైపు వెళ్తుండగా పోలీసులు సినీఫక్కీలో ఛేజ్‌చేస్తూ గుర్రాలబైలు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు గుర్రాలబైలు నుంచి లచ్చిగూడెం, మారాయిగూడెం, చేరుపల్లి మీదుగా భద్రాచలానికి సీఎల్పీ నేతల కాన్వాయ్‌ను మళ్లించారు.

ఆపై భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన నేతలు బూర్గంపాడు మీదుగా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ పరిశీలనకు బయలుదేరారు. అయితే, సీఎల్పీ బృందాన్ని బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో పోలీసులు నేతల వాహనాలను బలవంతంగా కొత్తగూడెం వైపు మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు. అక్కడినుంచి నేతలను కొత్తగూడెం మీదుగా కాళేశ్వరం వెళ్లాలని సూచించిన పోలీసులు మార్గమధ్యలో పాల్వంచ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆపై సీఎల్పీ బృందాన్ని వాహనాల్లో బందోబస్తు నడుమ ఇల్లెందుకు తరలించారు.

అనంతరం కాళేశ్వరం మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా నాయకులు వాహనాల నుంచి కిందకు దిగారు. దీంతో ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అయితే, గెస్ట్‌హౌస్‌ తాళాలు లేకపోవడంతో 11గంటల వరకు ఆవరణలోనే నాయకులు పడిగాపులు కాశారు. చివరకు తాళాలు తీసుకురాగా, భోజనం అనంతరం కాళేశ్వరం బయలుదేరనున్నట్లు నాయకులు వెల్లడించారు. 

తెలంగాణనా.. పాకిస్తానా? 
ఇది తెలంగాణనా లేకపోతే పాకిస్తానా.. అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు సమాచారమిచ్చి గోదావరి ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. దుమ్ముగూడెం పర్యటనకు వెళ్తుంటే మావోల ప్రభావిత ప్రాంతమని, అశ్వాపురం వెళ్తుంటే అనుమతులు లేవని అడ్డుకున్నారని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పాతరేయడం ఖాయమన్నారు. గోదావరి వరద ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. 

మరిన్ని వార్తలు