ఒక తొండ.. 4 గంటలు కరెంట్‌ కట్‌! 

19 Jun, 2021 06:40 IST|Sakshi

ఇన్సులేటర్‌పై చనిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం  

30 స్తంభాల పరిశీలన.. చివరకు పునరుద్ధరణ  

సాక్షి, డోర్నకల్‌: ఓ తొండ గురువారం అర్ధరాత్రి విద్యుత్‌ సిబ్బందికి చుక్కలు చూపించింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీనికితోడు వర్షం పడటం, విపరీతంగా దోమలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు విద్యుత్‌ సరఫరా అంతరాయానికి కారణమేమిటని విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు.

సబ్‌స్టేషన్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇంజనీర్, ఇతర ఇబ్బంది సబ్‌ స్టేషన్‌ నుంచి రైల్వే ట్రాక్‌ వరకు 11 కేవీ లైన్‌కు సంబంధించి సుమారు 30 స్తంభాలపైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్‌ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్‌ ఇన్సులేటర్‌ మీద తొండ పడి చనిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినట్లు గుర్తించారు. వెంటనే తొండను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.   
చదవండి: మహబూబ్‌నగర్‌ జిల్లాలో హైవేపై ట్రక్కు బీభత్సం

మరిన్ని వార్తలు