రిజర్వేషన్లు కల్పించాలని సంచారజాతుల మహాధర్నా

17 Jul, 2022 02:34 IST|Sakshi

ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా బీఎస్సీ, ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ల మద్దతు

కవాడిగూడ: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, అస్థిత్వానికి ప్రతీక సంచార జాతులు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. 76 సంచార జాతుల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద సంచార జాతులకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాడ్‌ చేస్తూ మహాధర్నా నిర్వహించారు.

మహాధర్నాకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణŠ కుమార్, ఆమ్‌ఆద్మీ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్‌ ఇందిరాశోభన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల మాట్లాడుతూ... సంచార జాతుల కులం, ఊరు, వృత్తిని కూడా గుర్తించలేని వ్యవస్థ ఉండటం దారుణమన్నారు. సంచార జాతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ... సంచార జాతులను రాజ్యాంగబద్ధమైన కులాలుగా గుర్తించి విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్‌ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న సంచార జాతులకు నామినేటెడ్‌ ఎంపీ, ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి తిరిపిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ, కోఆర్డినేటర్‌ సమ్మయ్య, అధికార ప్రతినిధి నాగరాజు  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు