Telangana: 'సుమోటో' సిత్రాలు.. రైతులకు తెలియకుండానే..

13 Oct, 2022 04:31 IST|Sakshi

ప్రహసనంగా మారిన ‘నిషేధిత భూముల’ సమస్య పరిష్కారం

రైతులకు తెలియకుండానే జరిగిపోతున్న ‘పరిశీలన’

పాస్‌ పుస్తకాలున్న భూముల వివరాలనే తహసీల్దార్లకు పంపుతున్న కలెక్టర్లు 

ధరణి పోర్టల్‌కు సంబంధించి తహసీల్దార్లు పరిశీలించిన భూముల్లో కూడా 90% వరకు నిషేధిత జాబితాలోనే కొనసాగింపు 

కేవలం 10% భూములకే మోక్షం కల్పిస్తున్న కలెక్టర్లు? 

పాత అవార్డు కాపీ కావాల్సిందేనని మెలిక.. తలపట్టుకుంటున్న తహసీల్దార్లు 

సుమోటో పేరిట కొత్తగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించని వైనం

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల ‘సుమోటో’పరిశీలనలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొండ నాలుకకు మందేస్తే.. అన్నట్టుగా క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తరతరాలుగా సాగుచేసుకుంటున్న మా పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించండి.. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో మార్పులు చేయండి..’అని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు గత రెండేళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. రైతుల ఆవేదనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. సుమోటోగా (ధరణిలో సదరు పట్టాదారుడు దరఖాస్తు చేసుకోకుండానే) ఈ భూముల వివరాలను పరిశీలించి అర్హమైన వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.  

అందుబాటులో ఉన్న రికార్డుల మేరకే.. 
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు మండల తహసీల్దార్‌ కార్యాలయాలకు నిషేధిత భూముల జాబితాలను పంపారు. అయితే నిషేధిత భూముల జాబితాలో ఉన్న, ఇప్పటివరకు పాస్‌ పుస్తకాలు జారీ అయిన భూముల వివరాలను మాత్రమే పంపారు. అలా పాస్‌ పుస్తకాలు జారీ అయిన భూములు 50 శాతం మాత్రమే ఉంటాయని, మిగిలిన భూములకు అనేక సమస్యలతో డిజిటల్‌ సంతకాలు కాలేదని, అందుకే పాస్‌ పుస్తకాలు జారీ కాలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కేవలం పాస్‌ పుస్తకాలు జారీ అయిన భూముల వివరాలను మాత్రమే పంపి వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పలు మండలాల తహశీల్దార్లు నిషేధిత జాబితాలో భూముల్లో అర్హమైన వాటిని సుమోటోగా తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయకుండా, కేవలం తమ వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి కలెక్టర్లకు నివేదికలు పంపుతున్నారు. కాగా తహశీల్దార్లు పరిశీలించిన వాటిలో కూడా 90 శాతం భూములను మళ్లీ నిషేధిత జాబితాలోనే కొనసాగిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు ఇస్తున్నారని, కేవంల 10 శాతం భూములకు మాత్రమే విముక్తి కలుగుతోందని రెవెన్యూ వర్గాలు చెపుతుండడం గమనార్హం. 

ఎప్పటిదో అవార్డు కాపీ కావాల్సిందేనట! 
వాస్తవానికి నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల్లో 90 శాతం గతంలో ప్రభుత్వం తన అవసరాల కోసం సేకరించిన సర్వే నంబర్లలోనే ఉన్నాయి. మిగతా వాటిలో 5 శాతం కోర్టు కేసులు కాగా, మరో 5 శాతం పొరపాటున నిషేధిత జాబితాలో పెట్టిన భూములున్నాయి. ప్రస్తుతం సుమోటో పరిశీలన చేపట్టిన అధికారులు.. సదరు భూమిపై యజమానికి పట్టా ఎలా వచ్చింది? ఎన్ని సంవత్సరాల నుంచి పహాణీలో అతని పేరు మీద భూమి ఉంది? అనే విషయాలను పరిశీలిస్తే ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా వద్దా అనే విషయం రెవెన్యూ వర్గాలకు నిర్ధారణ అయిపోతుంది. కనీసం 20–30 ఏళ్లుగా పహాణీలో పేరు వస్తే దాన్ని రైతు పట్టా భూమిగా నిర్ధారించవచ్చు. కానీ కలెక్టర్లు ఇక్కడ కొత్త మెలికలు పెడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడో రోడ్డు కోసం ఒక సర్వే నంబర్‌లోని ఎకరం భూమిని తీసుకుంటే ఇప్పుడు ఆ సర్వే నంబర్‌లో ఉన్న మిగతా పట్టా భూములను కూడా భూసేకరణ కింద నిషేధిత జాబితాలో ఉంచారు.

వాస్తవానికి ఈ ఒక్క ఎకరం మినహా మిగిలిన అన్ని ఎకరాలకు పట్టాలున్నాయి. ఈ భూములను నిషేధిత జాబితా నుంచి నేరుగా తొలగించవచ్చు. కానీ విచిత్రంగా 1980లోనో, అంతకుముందో, ఆ తర్వాతో సదరు ఎకరం భూమిని రోడ్డు కోసం కేటాయించిన ధ్రువపత్రం (అవార్డు కాపీ) కూడా కావాల్సిందేనని, అప్పటివరకు ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేది లేదని కలెక్టర్లు చెబుతుండటం గమనార్హం. ఆ అవార్డు కాపీ దొరకడం లేదని తహశీల్దార్లు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. పైగా తహశీల్దార్లకు కలెక్టర్లు పరిశీలనకు సంబంధించిన టార్గెట్లు విధిస్తున్నారని, సిబ్బంది లేకపోవడంతో ఎమ్వార్వోలు ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి 

మళ్లీ అవకాశం ఇస్తారా? 
ఈ పరిశీలన అనంతరం నిషేధిత జాబితా నుంచి తొలగించని భూముల విషయంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడం గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం నిషేధిత జాబితాలోని భూముల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళుతున్న రైతులతో.. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, సమస్యను తామే పరిష్కరిస్తామని కలెక్టర్‌ స్థాయి నుంచి ఆర్‌ఐ వరకు చెబుతుండడం గమనార్హం. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కేవలం పాస్‌పుస్తకాలున్న భూములను సుమోటోగా పరిశీలిస్తున్న ప్రభుత్వం.. మిగిలిన భూములను ఎప్పుడు పరిశీలించి పరిష్కరిస్తుందో, ప్రస్తుతం పరిశీలిస్తున్న భూముల్లో తిరస్కరించిన వాటి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.  

 రైతులకు తెలియకుండానే.. 
మరీ విచిత్రమేమిటంటే.. ఈ ప్రక్రియ గురించి అసలు రైతుకు తెలియకపోవడం. కలెక్టర్‌ పంపిన భూముల వివరాలు, ఆ వివరాల్లో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి తహసీల్దార్లు ఇచ్చే నివేదికలు, వాటి ఆధారంగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారా? లేక అలాగే కొనసాగిస్తున్నారా? అనే విషయాలేవీ రైతులకు తెలియడం లేదు. ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలు రావడం.. కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు, తహసీల్దార్ల నుంచి మళ్లీ కలెక్టర్లకు భూముల వివరాలు వెళ్లడం, వాటిపై కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు