Ramadan Month: నేటి నుంచి రంజాన్‌..

24 Mar, 2023 09:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్‌ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్‌ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్‌ కళ మళ్లీ తిరిగి రానుంది.

ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్‌లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్‌ మార్కెట్‌లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. 

ఆదర్శ జీవనానికి రంజాన్‌ మాసం ప్రేరణ: సీఎం
సాక్షి, హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్‌ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు.

ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ఖురాన్‌ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధా‍ర్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.   

మరిన్ని వార్తలు