‘సజీవ దహనం’ హత్యగానే భావిస్తున్నాం

20 Dec, 2022 03:25 IST|Sakshi

రామగుండం సీపీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి

నిందితులతో ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్‌: ‘ఆరుగురు సజీవ దహనం’ కేసును విచారణ చేస్తున్నాం. మా ప్రాథమిక విచారణ లో దీనిని హత్యగానే భావిస్తున్నాం. ఆ కోణంలోనే విచారణ సాగుతోంది. అందులో ఎంతమంది ఉన్నారో త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాం’ అని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామగుండం సీపీ మీడియాతో మాట్లాడారు.

నిందితులు వాడిన పెట్రోల్‌ క్యాన్లు, పరిసర స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అఖిల్‌ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌రావు ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటాపూర్‌ (గుడిపెల్లి) ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. 
సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌...: సోమవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ప్రధాన నిందితులు ముగ్గురితో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.

రెండు గంటలపాటు నిందితుల సమక్షంలోనే నేరం జరిగిన తీరు తెలుసుకున్నారు. ఇల్లు కాలిపోయిన చోటికి రెండు వాహనాల్లో వెళ్లారు. ఎవరు సాయం చేశారు? పెట్రోల్‌ క్యాన్లను ఎలా తీసుకెళ్లారనే విషయాలను నిందితులు వివరించగా, వాటిని ఘటన స్థలంలోనే మరోమారు ధ్రువీకరించుకుని రికార్డు చేశారు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు