ఎలక్ట్రిక్‌ డక్ట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌.. స్వప్నలోక్‌ అగ్నిప్రమాదానికి కారణమిదే..

18 Mar, 2023 08:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్‌ వైర్లకు సంబంధించిన డక్ట్‌లో షార్ట్‌ సర్క్యూటే కారణమని అగి్నమాపక శాఖ అధికారులు తేల్చారు. ఈ మంటలు ఐదో ఫ్లోర్‌లో బయటకు వచ్చి ఆరు, ఏడు ఆంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురూ ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారని, మంటలకు భయపడి బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని నిర్ధారించారు. శుక్రవారం పోలీసులు, క్లూస్‌టీమ్స్‌ కాంప్లెక్స్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి. అగి్నమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.

డక్ట్‌ నుంచి పైకి వ్యాప్తి..
ఎలక్ట్రిక్‌ వైర్ల డక్ట్‌లో మొదలైన మంటలు నాలుగో ఫ్లోర్‌ వరకు లోలోపలే విస్తరించాయి. ఐదో ఫ్లోర్‌లో డక్ట్‌ తెరిచి ఉండటంతో పక్కనే ఉన్న ఫ్లాట్‌ నం.510, 511ల్లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ అండ్‌ వికాస్‌ పేపర్‌ ఫ్లెక్సో ప్యాకింగ్‌ లిమిటెడ్, క్యూ నెట్‌–విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిలెడ్‌ సంస్థలకు వ్యాపించాయి. ఆరు, ఏడు అంతస్తులకూ ఎగబాకాయి. ఇది దాదాపు రాత్రి 7.15 గంటల సమయంలో చోటు చేసుకుంది. క్యూ నెట్‌ కార్యాలయం నుంచి ఉద్యోగులు, టెలికాలర్లు ప్రతి రోజూ సాయంత్రం 6–7 గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత టీమ్‌ లీడర్లతో పాటు కొందరు మాత్రమే ఉంటారు.

గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగే సమయానికి అందులో దయాకర్, శ్రావణ్, పవన్‌ (రెస్క్యూ అయ్యారు)లతో పాటు శివ, త్రివేణి, వెన్నెల, ప్రమీల, శ్రావణి, ప్రశాంత్‌ (అసువులు బాశారు) ఉన్నారు. రాత్రి 7.30 గంటల కు కార్యాలయంలోకి పొగ రావడాన్ని గమనించిన మొదటి ముగ్గురూ వెనుక వైపు ఉన్న కిటికీ పగులకొట్టుకుని సజ్జపైకి దిగారు. అక్కడ నుంచే తమ ఉనికిని కింద ఉన్న అగి్నమాపక, డీఆర్‌ఎఫ్‌ అధికారులకు తెలియజేసి ప్రాణాలు దక్కించుకున్నారు.

భయంతో బయటకు రాలేక.. 
మిగిలిన ఆరుగురూ భయంతో కార్యాలయం లోపలకు వరకు వెళ్లిపోయారు. దీనికి సమీపంలో ఉన్న ఒమెగా సంస్థను నిర్వహించే సు«దీర్‌రెడ్డి ఈ విషయం గమనించారు. ధైర్యం చేసిన ఆయన క్యూనెట్‌ వరకు వెళ్లి అందులో ఉన్న వారిని తనతో రావాల్సిందిగా కోరారు. నలుగురు యువతులు ఆయనతో కలిసి కాస్త ముందుకు వచి్చనా.. అక్కడ దట్టమైన పొగ చూసి భయపడి మళ్లీ తమ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. సు«దీర్‌ మాత్రం భవనం బీ బ్లాక్‌ ముందు వైపునకు చేరుకుని అక్కడున్న ఖాళీ ప్రదేశంలో, పొగ ప్రభావం ఏమాత్రం లేనిచోట నిలబడ్డారు. సెల్‌ఫోన్‌లో లైట్‌ వెలిగించడం ద్వారా సహాయక సిబ్బంది గుర్తించేలా చేసి బయటపడ్డారు. క్యూ నెట్‌ కార్యాలయంలో ఉన్న నలుగురు యువతుల్లో ముగ్గురు బాత్‌రూమ్‌లోకి వెళ్లి పొగ రాకూడదనే ఉద్దేశంతో తలుపు వేసుకున్నారు. మరో యువతితో పాటు ఇద్దరు యువకులు ఆ సమీపంలోని గదిలో వేర్వేరు చోట్ల ఉండిపోయారు. అలా అక్కడే ఆగిపోయిన ఆరుగురు పొగ పీల్చుకోవడం వల్లే మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

స్టెయిర్‌కేస్‌ గ్రిల్స్‌కు తాళం వేయడం వల్లే..
ఈ కాంప్లెక్స్‌లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు అమలు కావట్లేదని, పైపులు ఉన్నా పని చేయట్లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్‌కు లిఫ్ట్‌లు ఉండటంతో ఐదో అంతస్తులో ఫ్లోర్‌కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్‌ను లాక్‌ చేసి ఉంచడం, అక్కడ సామాను పెట్టుకోవడం కూడా ఆరుగురు మృతి చెందడానికి ఓ కారణమైందన్నారు. ఇకపై కాంప్లెక్సుల్లో గ్రిల్స్‌కు ఇలా తాళాలు వేసి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.

పలు సెక్షన్ల కింద కేసు 
అగి్నప్రమాదంపై కాంప్లెక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్వప్నలోక్‌ సూర్యకిరణ్‌ ఎస్టాబ్లి‹Ùమెంట్‌ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ అండ్‌ వికాస్‌ పేపర్‌ ఫ్లెక్సో ప్యాకింగ్‌ లిమిటెడ్, క్యూ నెట్‌–విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిలెడ్‌ సంస్థలపై ఐపీసీలోని 304 పార్ట్‌ 2, 324, 420 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ 9 (బి) కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. 

క్యూ నెట్‌ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు 
స్వప్నలోక్‌లో అగ్ని ప్రమాదం క్యూ–నెట్‌ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనలో చనిపోయిన ఆరుగురూ ఈ సంస్థలో పనిచేస్తున్న వారిగా తేలింది. అయితే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించడం పేరుతో క్యూ నెట్‌ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు తెరలేపడంపై గతంలో సీఐడీ సహా అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మళ్లీ ఈ సంస్థ తమ కార్యకలాపాలు ప్రారంభించిందని, ప్రచారం కోసం సెలబ్రెటీలను వినియోగించుకుంటోందని ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచి్చన సీనియర్‌ ఐపీఎస్‌ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి క్యూ నెట్‌పైనా కేసు నమోదైన నేపథ్యంలో దీని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మహంకాళి పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 

పేలుడు పదార్థాల చట్టం మొదటిసారి..
స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదంపై మహంకాళి పోలీసులు ఐపీసీ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అగి్నప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి సెక్షన్లు జోడించడం ఇదే ప్రథమం. అనుమతి లేకుండా గ్యాస్‌ సిలిండర్లు కలిగి ఉండటం, బాణసంచా నిల్వ చేయడం, పేలుడు పదార్థాలు, రసాయనాలు దాచి ఉంచడం వంటి వాటి వల్లా ఫైర్‌ యాక్సిడెంట్స్‌ జరుగుతున్నాయి. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనూ ఇలాంటివి అక్రమంగా నిల్వ చేస్తే మోసం చేసినట్లే. ఈ కారణంగానే ఐపీసీ సెక్షన్‌ 420తో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ను జోడించారు. ఈ కాంప్లెక్స్‌లో అనేక కార్యాలయాలతో పాటు గోదాములు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు క్లూస్‌ టీమ్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం..

మరిన్ని వార్తలు