మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు

7 May, 2023 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు’’... ఇదేదో ఒకరోజులోని దుర్ముహూర్తం కాదు. ఆ ఆరు గంటలే వాహనచోదకులపాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఆ కొన్ని గంటల్లో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. 2022లో ఏడాది పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాలను  విశ్లేషిస్తే తేలిన విషయం ఇది. రాష్ట్ర పోలీస్‌ శాఖలోని రైల్వే, రోడ్డు భద్రత విభాగం అధికారులు 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు నమోదైన సమయం, ప్రమాద మృతులసంఖ్యను గణాంకాలవారీగా విశ్లేషించారు.

దీనిలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరగడమే కాక ఎక్కువమంది మృత్యు వాత పడుతున్నట్టు గుర్తించామని రోడ్డు భద్రతావిభాగం అడిషనల్‌ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కు­వగా జరగడానికి కారణాలు ఏమిటని విశ్లేషిస్తే, అది ఉద్యోగు లు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడం, ద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లే వేళ కావడం, ఇతర పనులపై జనం రోడ్లపైకి ఎక్కువగా వచ్చే సమయం కావడంతోనే ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ప్రమాదాలు తగ్గించడంతోపాటు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు, రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాలు జరిగితే వెంటనే అందించే ప్రాథమిక చికిత్సపైనా అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు