అటు ఆదాయం.. ఇటు ఆరోగ్యం..

17 Sep, 2023 01:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిల్లెట్లలో ఔషధ గుణాలు ఎక్కువ. పోషకాహారపరంగా ఇవి ఎంతో కీలకమైనవి. సాగుపరంగా రైతుల కు ఖర్చు తక్కువగా ఉండి..మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అందుకే మిల్లెట్లు కీలకమైనవిగా భావిస్తుంటామని నాబార్డ్‌ చైర్మన్‌ షాజీ కేవీ అన్నారు. మిల్లెట్స్‌ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....అగ్రి ఎకానమీలో మిల్లెట్ల పాత్ర ఎంతో కీలకం.

ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్‌ వాటా 41 శాతం. ఆసియాలో 81 శాతం మిల్లెట్‌ విస్తీర్ణం ఇండియాలోనే. మిల్లెట్లు వర్షాభావంలోనూ పండుతాయి. ఇతర పంటలు ఐదు నెలల్లో చేతికి వస్తే, మిల్లెట్లు మూడు నెలల్లోనే చేతికి వస్తాయి. దేశంలో అన్ని రకాల వాతావరణానికి ఇవి అనుకూలం.  

ప్రజల్లో మిల్లెట్లపై అవగాహన పెంచాలి  
గతంలో మనం మిల్లెట్లను ఆహారంగా తీసుకునేవారం. కానీ దేశంలో జనాభా పెరగడంతో ఆహారభద్రత సమస్యగా మారింది. దీంతో మన ఆహారపు అలవాట్లు మారి, ప్రజలకు అవసరమైన పంటలను ముందుకు తీసుకొచ్చాం. దీని ఫలితమే హరిత విప్లవం. ప్రజలు గోధుమ, బియ్యమే ఆహారంగా తీసుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ మిల్లెట్లను ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మిల్లెట్‌ సాగులో రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందాలి.వీటికి మరింత ప్రచారం కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మిల్లెట్లపై ఇప్పటికే పూర్తి అవగాహన ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ప్రచారం కల్పించాలి.  

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం 
దేశంలో గోధుమలు, బియ్యానికి ప్రాధాన్యం ఉంది. వాటికి ప్రజలు అలవాటు పడ్డారు. దీన్ని రాత్రికి రాత్రే మార్చలేం. బియ్యం, గోధుమలు పండించాలంటే నీరు కావాలి. మిల్లెట్లు పండించాలంటే తక్కువ నీరు సరిపోతుంది. మిల్లెట్లను సుస్థిరమైన వ్యవసాయంగా భావించొచ్చు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉత్పత్తి, ఉత్పాదకత, విక్రయాలు పెరిగితే మిల్లెట్ల ధరలు తగ్గుముఖం పడతాయి.

దీనివల్ల వినియోగదారులకు సరసమైన ధరలకు అందించగలం. రూ. లక్ష కోట్ల అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ఉంది. దానిద్వారా రుణాలు ఇవ్వాలి. కానీ అందులో రూ. 26 వేల కోట్లు మాత్ర మే వినియోగిస్తున్నారు. మిల్లెట్లకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన విషయం పూర్తిగా విధానపరమైన నిర్ణయం. దీనిని కేంద్రమే చెప్పాలి. ప్రస్తుతం 26 రకాల పంటలకు మద్దతు ధర కల్పించారు. అందులో కొన్ని రకాల మిల్లెట్లు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు