ఎంబీఏ విద్యార్థి; పనిలో చేరిన రోజే అనంత లోకాలకు.. 

2 Jul, 2021 10:44 IST|Sakshi
ప్రవీణ్‌ కుమార్‌(ఫైల్‌)

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన

ఏస్‌ వాహనం.. యువకుడి మృతి

మృతుడు ఎంబీఏ విద్యార్థి 

సాక్షి, చైతన్యపురి: ఆగి ఉన్న లారీని ఏస్‌ వాహనం ఢీకొనటంతో డైరీ కంపెనీ డెలివరి బాయ్‌ మృతి చెందిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన భాస్కర్‌ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ (21). ఉప్పల్‌లోని సూపర్‌ డైరీ కంపెనీలో డెలివరి బాయ్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం ఏస్‌ వాహనం (టీఎస్‌08యూపీ8085)లో పాలు డెలివరి చేసేందుకు ఎల్‌బీనగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తున్నాడు. ఏస్‌ వాహనాన్ని డ్రైవర్‌ రోషన్‌ నడుపుతుండగా పక్క సీట్లో ప్రవీణ్‌కుమార్‌ కూర్చున్నాడు.

అదే సమయంలో వీఎం హోమ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద టీఎస్‌ (08యూబీ3939) నంబర్‌ గల లారీ రోడ్డుపై ఆగి ఉంది. పార్కు చేసిన లారీకి పార్కింగ్‌ లైట్‌ లేకపోవటంతో అదుపు తప్పిన ఏస్‌ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ పక్కన కూర్చున్న ప్రవీణ్‌కుమార్‌ రెండు వాహనాల మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఏస్‌ వాహనం డ్రైవర్‌ రోషన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్‌కుమార్‌ మెగా కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి భాస్కర్‌ కారు డ్రైవర్‌గా, తల్లి ఇండ్లలో పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ఆర్థికంగా ఆసరా ఉండాలనే ఉద్దేశంతో డెలివరి బాయ్‌గా చేరాడు. డ్యూటీలో చేరిన మొదటి రోజే ప్రవీణ్‌కుమార్‌ చనిపోవటంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. బాధ్యుడైన లారీ డ్రైవర్, సూపర్‌ డైరీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతిడి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: ప్రేమ, 3 సార్లు ఇంటి నుంచి పారిపోయింది.. చివరికి!
KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు