సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణారావు కన్నుమూత

18 Aug, 2023 02:07 IST|Sakshi

 గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖుల నివాళి

హఫీజ్‌పేట్‌/సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు.

రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్‌’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్‌ క్రానికల్, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్‌ క్రానికల్‌ పత్రికలో న్యూస్‌ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు.

గత ఏడాది ఆయన కేన్సర్‌ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం
కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

ప్రముఖుల నివాళి
కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు