కొబ్బరి డీలా.. అరటి అధరేలా... | Sakshi
Sakshi News home page

కొబ్బరి డీలా.. అరటి అధరేలా...

Published Fri, Aug 18 2023 2:06 AM

- - Sakshi

రావులపాలెం మార్కెట్‌ యార్డులో

ఎగుమతులకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు

రావులపాలెం అరటి మార్కెట్‌ జోరు

పెరిగిన ధరలతో రైతులకు ఊరట

అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ బే జారు

ఆశించిన స్థాయిలో లేని ఎగుమతులు

సాక్షి అమలాపురం/ రావులపాలెం/ అంబాజీపేట: శ్రావణ మాసం వచ్చింది. వరుస శుభ ముహూర్తాలు... పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, మరోవైపు వరలక్ష్మీ పూజలు, గ్రామాల్లో అమ్మవారి జాతరలు తెచ్చింది. ఈ సందడి వినాయక చవితి వరకూ ఉంటోంది. దీనివల్ల జిల్లాలోని అతి పెద్ద మార్కెట్లయిన రావులపాలెం అరటి, అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌ ఊపందుకుంటోంది. ఈ సమయంలో ఏటా అరటి, కొబ్బరి ధర పెరుగుతోంది. ప్రస్తుతం రావులపాలెం అరటి మార్కెట్‌లో ఎగుమతులు జోరందుకుని ధరలు పెరిగినా.. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎగుమతులు, ధరలు లేక రైతులు డీలా పడుతున్నారు.

అదిరేటి ధర

రావులపాలెం మార్కెట్‌లో అరటి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైరుతిలో వర్షాలు పడకపోవడానికి తోడు గత నెలలో వరదలతో లంక గ్రామాల్లో అరటి పంటలకు నష్టం వాటిల్లడంతో గెలల ధరలు ఆకాశాన్నంటాయి. దిగుబడి తగ్గడంతో పాటు శ్రావణ మాసం, శుభ కార్యక్రమాల వల్ల రేటు పెరగడానికి కారణమైంది. కర్పూరం రకం గెల ధర రూ.600 వరకూ పలుకుతుండటం విశేషం. వారం రోజుల కిందటి వరకూ అంతంత మాత్రంగా ఉన్న అరటి ధర ఒక్కసారిగా పెరిగింది. వారం కిందట గెల రూ. 100 నుంచి రూ.250 ఉండేది. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.600 వరకూ పలుకుతోంది. దీనితో పాటు చక్కెర కేళి, ఎరుపు చక్కెర కేళి, అమృతపాణి, బొంత అరటి ధరలు కూడా పెరిగాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అరటి పంట దిగుబడి తగ్గింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా దిగుబడులు లేదు. ఇదే ఊపు దసరా వరకూ మరో నెలా పదిహేను రోజుల పాటు ఉండొచ్చని అరటి వ్యాపారి కోనాల చంద్రశేఖర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.

నిరాశే మిగిలింది

సాధారణంగా శ్రావణ మాసంలో ఎగుమతులు జోరందుకుని, ధరలు పెరిగే కొబ్బరి ఈ సారి నిరాశ మిగిల్చింది. శ్రావణానికి తోడు ప్రభుత్వం త్వరలోనే నాఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొబ్బరి ధరలు పెరగలేదు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అనుకున్న స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు 30 లారీల మించి కూడా కొబ్బరి రవాణా జరగడం లేదు. సాధారణ రోజుల్లో రోజుకు సగటున 75 లారీల కొబ్బరి ఎగుమతి కాగా, శ్రావణం సీజన్‌లో ఇది 125 లారీల వరకూ ఉంటోంది. ప్రస్తుత అంబాజీపేట మార్కెట్‌లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.7 వేల నుంచి రూ.7,400 వరకూ ఉంది. ముక్కుడు కాయ రూ.6,800 నుంచి రూ.7.200 వరకూ పలుకుతుంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ ధర మరింత తక్కువ. దీనితో పాటు కొత్త కొబ్బరి (తయారీ కొబ్బరి, ఎండు కొబ్బరి) క్వింటాలు ధర రూ.8,200 వరకూ ఉండగా, కురిడీ కాయలో పాతరకంలో గండేరా రకం వెయ్యికాయల ధర రూ.12 వేలు, గటగట రకం రూ.10 వేలు, కొత్తరకంలో గండేరా రూ.11 వేలు, గటగట రూ.9 వేలు మాత్రమే ఉంది. ఆరు నెలలుగా కొబ్బరి ధరలు పెద్దగా పెరగడం లేదు. మరోవైపు తెల్లదోమ ఉధృతి వల్ల 30 శాతం దిగుబడి తగ్గింది. దీనికితోడు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఉత్తరాదికి ఎగుమతుల కారణంగా స్థానిక కొబ్బరికి ధర లేకుండా పోయింది. ఒకవైపు దిగుబడి, మరోవైపు ధర లేక కొబ్బరి రైతులు దిగాలు చెందుతున్నారు.

రావులపాలెం అరటి మార్కెట్‌లో ధరలు

అరటి రకం వారం కిందట గెల ధర రూ. ప్రస్తుతం

(కనిష్ట... గరిష్ట) (కనిష్ట... గరిష్ట)

కర్పూరం 100 నుంచి 200 150 నుంచి 600

అమృతపాణి 110 నుంచి 200 200 నుంచి 600

చక్కెరకేళి 150 నుంచి 250 200 నుంచి 600

ఎరుపు చక్కెరకేళి 150 నుంచి 350 250 నుంచి 700

బొంత అరటి 80 నుంచి 150 150 నుంచి 300

అస్సలు ఊహించలేదు

వారంలో అరటి గెలలకు ఈ స్థాయిలో ధర వస్తోందని అస్సలు ఊహించలేదు. దిగుబడి తగ్గడం వల్లే ధరలు ఇంత పెరిగాయి. నేను ఐదున్నర ఎకరాల్లో కర్పూరం అరటి పండిస్తున్నాను. ప్రస్తుతం కొద్దిగా గెలలు వస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే గట్టెక్కుతాం.

– శీలం వెంకటరమణ, అరటి రైతు,

రావులపాడు, రావులపాలెం మండలం

ఏడు నెలలుగా ఇంతే..

కొబ్బరి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఏడు నెలలుగా కొబ్బరి ధరలు పెరిగిన దాఖలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొబ్బరి దింపులు తీసేందుకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు. శ్రావణ మాసంలోనైనా ధరలు పెరుగుతాయనుకున్నా నిరాశే మిగిలింది.

– గుత్తుల శ్రీనివాస్‌, రైతు,

అయినాలవారిపాలెం, పి,గన్నవరం

రైతుల వద్ద పేరుకుపోయిన కొబ్బరి రాశులు
1/3

రైతుల వద్ద పేరుకుపోయిన కొబ్బరి రాశులు

2/3

3/3

Advertisement
Advertisement