3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?

10 Feb, 2021 10:27 IST|Sakshi

నిజామాబాద్, బోధన్‌ బార్లకు తక్కువ దరఖాస్తులు 

ఏమై ఉంటుందని పరిశీలన జరుపుతున్న అధికారులు

ఇటు 16 వరకు దరఖాస్తు గడువు పెంపు.. 19న లాటరీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్‌ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్‌ కార్పొరేషన్, బోధన్‌ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్‌ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి.

కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్‌లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది.

నిజామాబాద్‌లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్‌లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్‌ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి.

చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు!

మరిన్ని వార్తలు