మానేరు వాగులో 25 గంటల నిరీక్షణ

1 Sep, 2021 03:22 IST|Sakshi
వరదలో చిక్కుకున్న యువకులు, గొర్రెల కాపరి

సిరిసిల్లవాగులో చిక్కిన  గొర్రెలకాపరి.. రాత్రంతా చీకట్లోనే..  

కాపరి కోసం వెళ్లి వరదలో చిక్కుకున్న ఐదుగురు యువకులు 

బోటుసాయంతో రక్షించిన అధికారులు 

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వాగు వరదలో గొర్రెలకాపరి చిక్కుకుని 25 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చుట్టూ వరద రావడంతో ఎటూ వెళ్లలేక రాత్రంతా గొర్రెలతోపాటు ఉన్నాడు. ఇతని కోసం వెళ్లిన మరో ఐదుగురు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు వీరిని బోటుసాయంతో ఒడ్డుకు చేర్చారు. వివరాలు... సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన మొగిలి చంద్రమౌళి(58) గొర్రెలకాపరి.

తనకున్న గొర్రెలు, మేకలను మేపేందుకు సోమవారం ఉదయం మానేరు మధ్యలో ద్వీపంలా ఉండే ప్రాం తానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాగులో వరద ఉధృతి పెరగడంతో రెండు గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో తెల్లవార్లు అతను వాగు మధ్యలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పాడు. సిరిసిల్ల పట్టణం సాయినగర్‌కే చెందిన కె.రాజు(26), కె.అప్పారావు(22), ఎస్‌.విజయ్‌ (21), కె.రాజు(22), విజయ్‌(26) మంగళవారం ఉదయం చంద్రమౌళిని కాపాడేందుకు మానేరువాగు దాటి వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ఎక్కువకావడంతో వారూ వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని, గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. 

మానేరులో కొట్టుకుపోయిన బస్సు 
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే దారిలో మానేరు వాగు వరదలో సోమవారం చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ప్రయాణికులం తా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, మానేరు నది వరద పరిస్థితి, గేట్లు ఎత్తే విష యం పశువుల కాపర్లు, జాలర్లకు తెలిసిపోయేలా, వారిని అప్రమత్తం చేసేలా సిరిసిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పశువుల కాపర్లు, జాలర్లతో పాటు వీపీవోలు, వీఆర్‌ఏ, వీఆర్వోలు ఉంటారు.  

మరిన్ని వార్తలు