మరుగుజ్జు.. శివలాల్‌ సాధించాడు!

20 Aug, 2021 06:51 IST|Sakshi

తెలుగు  రాష్ట్రాల్లో పర్మనెంట్‌ లైసెన్స్‌ పొందిన మొదటివ్యక్తిగా రికార్డు 

బంజారాహిల్స్‌: అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఓ మరుగుజ్జును అందరికీ ఆదర్శంగా నిలిపింది.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌రోడ్‌ నంబర్‌–10లోని గౌరీశంకర్‌ కాలనీలో నివసించే జి.శివలాల్‌(39) మరుగుజ్జు. బీకాం చదివాడు. భార్య కూడా మరుగుజ్జే. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో దారి వెంట వెళుతుంటే ‘పొట్టివాడు’అంటూ కొందరు గేలిచేసేవారు. వీడు సైకిల్‌ కూడా తొక్కలేడంటూ నవ్వేవారు. ఈ అవమానాలు శివలాల్‌లో పట్టుదలను పెంచాయి. సైకిల్‌ ఏం ఖర్మ, ఏకంగా కారే నడిపిద్దామని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది..! గతే డాది నవంబర్‌ 27న ఓ కారు కొనుక్కున్నాడు. క్లచ్, బ్రేక్‌ అందదు కాబట్టి కారును రీమోడలింగ్‌ చేయించాడు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టి నెలరోజుల్లోనే పూర్తిగా తర్ఫీదు పొందాడు. గత మార్చి 12న కారు నడిపించుకుంటూ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడు.

అయితే, ఇంతవరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరుగుజ్జులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వారంపాటు ఈ విషయంపైనే చర్చించి చివరకు ఈ నెల 6న శివలాల్‌కు పర్మనెంట్‌ లైసెన్స్‌ జారీ చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జులలో డిగ్రీ చేసిన మొట్టమొదటివ్యక్తి శివలాల్‌. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మరుగుజ్జు కూడా ఆయనే కావడం గమనార్హం.  
చదవండి: 3 పేర్లు 3 ఫోన్‌ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు..

మరిన్ని వార్తలు