సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత..!

22 May, 2023 03:31 IST|Sakshi

వెక్కిరిస్తున్న సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుల ఖాళీలు

గతేడాది సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పది ఫలితాల్లో తప్పిన విద్యార్థులు

పట్టించుకోని విద్యాశాఖ  

సాక్షి సిటీబ్యూరో: మహానగరంలో సర్కారు బడులకు సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారి భర్తీ లేక ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సబ్జెక్టు టీచర్లతో పాటు భాష పడింతుల పోస్టులు కూడా ఖాళీగా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

కరోనా నేపథ్యంలో వరసగా రెండేళ్ల పాటు ఆన్‌లైన్‌ చదువులు మొక్కుబడిగా సాగడంతో ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు లేకుండా విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించగా.. ఇటీవల సబ్జెక్టు టీచర్లు లేకుండానే 2022–23 విద్యా సంవత్సరం గడిచిపోయింది. ఫలితంగా పది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో తప్పారు. నూతన విద్యా సంవత్సరం గడువు సమీపిస్తున్నా టీచర్ల భర్తీ ఊసే లేకుండా పోయింది. 

పడిపోయిన ‘పది’ ఫలితాలు 
హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో పది ఫలితాలు మరింత అధ్వానంగా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 72 శాతం నమోదయ్యింది. 7244  మంది పరీక్షలకు హాజరు కాగా, 2009 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాంపల్లి, బహదూర్‌పురా, చార్మినార్, బండ్లగూడ, సికింద్రాబాద్‌ మండలాల్లోని  బడుల్లో 63 శాతం మించి ఉత్తీర్ణత లేకపోగా, మారేడుపల్లి, హిమయత్‌నగర్, గోల్కొండ, ముషీరాబాద్‌ మండలాల్లో 75 శాతం మించలేదు.

కేవలం తొమ్మిది  బడుల్లోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సబ్జెక్టు వారీగా ఫలితాలను పరిశీలిస్తే  గణితం 9425, సైన్స్‌ 6321, ఇంగ్లి ష్ లో 1129, సాంఘికశాస్త్రంలో 1021 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇక ప్రథమ, ద్వితీయ భాషల్లోనూ కొందరు తప్పారు. ప్రథమ భాష తెలుగులో 1331, హిందీలో 845, ఉర్దూలో 685, ద్వితీయ భాష తెలుగులో 1390, హిందీలో 117, మంది ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు