నట్టింటికే నలభీములు!

29 Nov, 2021 03:19 IST|Sakshi

ఇష్టమైన, సరికొత్త వంటలు చేసి పెట్టేస్తారు 

దేశ విదేశ రుచులు ఏవైనా సరే చిటికెలో సిద్ధం 

వినూత్న స్టార్టప్‌ ప్రారంభించిన శ్రుతిరెడ్డి 

‘ఓన్‌ యువర్‌ చెఫ్‌’ పేరిట అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: పులిహోర, బగారన్నం, గుత్తి వంకాయ, పూర్ణం బూరెలు, నేతి గారెలు, నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, మటన్‌ కీమా ఇలాంటి వంటలు ఇంట్లోనే సులువుగా వండేస్తారు. మరి క్లాసిక్‌ చికెన్‌కర్రీ, థాయ్‌ బాసిల్‌ చికెన్‌ స్టిర్‌ఫ్రై, ఇటాలియన్‌ పీనట్‌ నూడుల్స్‌ విత్‌ చికెన్, మెక్సికన్‌ కార్న్‌ టోర్టిల్లా, నాచో చిప్స్, గ్రీన్‌ టొమాటో సల్సా.. ఇలా చిత్రమైన పేర్లతో ఉండే టేస్టీ వంటలు చేయాలంటే ఎలా? ఏముందీ ఓ మంచి చెఫ్‌ (వంటల నిపుణుడు)ను ఇంటికి పిలిపించుకుంటే సరి.

గృహిణికి ఒకరోజు విరామం. ఉద్యోగినికి సెలవును సెలవుగా గడిపే అవకాశం. సరికొత్త వంటలను మన ఇంట్లోనే నచ్చినట్టుగా చేయించుకుని తినే వీలు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శ్రుతిరెడ్డి సరికొత్తగా ‘ఓవైచెఫ్‌ (ఓన్‌ యువర్‌ చెఫ్‌)’పేరుతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 

ఏం వండాలి? ఎంత వండాలి? 
ఆధునిక నలభీములను ఒకచోటికి చేర్చడం, అవసరమైన వారి ఇంటికే వెళ్లి వంట చేసిపెట్టడం కోసం ఆన్‌లైన్‌ వేదికగా ‘ఓవైచెఫ్‌’ను శ్రుతిరెడ్డి ప్రారంభించారు. ఈ తరహా ప్రయోగం మన దేశంలో ఇదే మొదటిసారని అంచనా. రోజూ వంటచేసే గృహిణికి ఒకరోజు విరామం కావాలన్నా.. ఇంట్లో ఏదైనా చిన్న వేడుక జరుపుకొంటున్నా.. చెఫ్‌ను మీ ఇంటికి పిలిపించుకుని వంట చేయించుకోవచ్చు. ఎంతమందికి వండాలో, ఏమేం వండాలో చెబితే చాలు.

‘ఓవైచెఫ్‌’నుంచి ఆ వంటల్లో స్పెషలిస్టులను మన ఇంటికి పంపుతారు. నార్త్‌ ఇండియన్, సౌత్‌ రుచులు, చైనీస్, థాయ్, ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్‌ ఇలా అన్నిరకాల వంటకాలు చేసే చెఫ్‌లు అందుబాటులో ఉంటారు. అంతేకాదు.. ప్రత్యేక వంటకాలు చేసేందుకు ఓవెన్‌లు, బార్బిక్యూల వంటి పరికరాలు లేకున్నా.. అందుబాటులో ఉండే పద్ధతిలోనే వంటలు చేయడానికి ప్రయత్నిస్తారని శ్రుతిరెడ్డి తెలిపారు. 

కలసి భోజనం చేస్తుండగా ఆలోచనతో.. 
శ్రుతిరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో ఉద్యోగం చేశారు. కొంతకాలం ఓ బొటిక్‌ నడిపారు. ఆ తర్వాత వర్జీనియా ప్రాంతంలో ‘టామరిండ్‌ ఇండియన్‌ కుకింగ్‌’పేరుతో ఒక రెస్టారెంట్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఈ ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చారు. తర్వాత కరోనా రెండో వేవ్‌ లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో రోజూ స్వయంగా వండుకుంటూ, అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో.. ఇంటికొచ్చి వంట చేసిపెట్టే చెఫ్‌ల ఆలోచన వచ్చిందని శ్రుతి చెప్పారు. ఆ ఆలోచనకు కార్యరూపమే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభమైన ‘ఓవైచెఫ్‌’అని వివరించారు. 

చెఫ్‌లకూ గౌరవం లభించాలి 
నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని మా తాత వంటేరు సుదర్శన్‌రెడ్డి చెప్తుండేవారు. ఆయన స్ఫూర్తితోనే కొందరు మిత్రుల సహకారంతో.. వినూత్నంగా ‘ఓవై చెఫ్‌’స్టార్టప్‌ తెచ్చాను. తినేవారి ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని వండగలిగిన నిపుణులు మావద్ద ఉన్నారు. గంటకు మూడు వందల రూపాయలు మొదలుకొని పన్నెండు వేల వరకు చార్జ్‌ చేసే టాప్‌ చెఫ్‌లూ ‘ఓవైచెఫ్‌’తో అనుసంధానమై ఉన్నారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరిస్తాం. వండటం అనే వృత్తికి సమాజంలో గౌరవస్థానం లభించేలా చేయాలనేది నా కోరిక.     


– శ్రుతిరెడ్డి, ఓవై చెఫ్‌ వ్యవస్థాపకురాలు  

మరిన్ని వార్తలు