పోలీసన్న నీకు సెల్యూట్‌.. మానవత్వం చాటుకున్న ఎస్సై!

12 May, 2021 08:24 IST|Sakshi
మృతదేహాన్ని తరలిస్తున్న ఎస్సై, సిబ్బంది 

సాక్షి,ఇల్లందకుంట(హుజురాబాద్‌): కరోనా సోకిన వ్యక్తి చెరువులో పడి మృతిచెందగా పోలీసులు బయటకు తీసి, అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఇల్లందకుంట మండలంలోని సిరిసేడులో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో చూసిన వారు పోలీస్‌.. సెల్యూట్‌ అంటూ అభినందిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసేడు గ్రామానికి చెందిన యాంసాని అమృతమ్మ, సంపత్, సతీష్‌లకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో సంపత్‌(38) మంగళవారం బహిర్భూమికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. శ్వాస సరిగా అందకపోవడంతో చెరువులో పడి మృతి చెందాడు.

విషయం తెలిసినా గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. ఎస్సై ప్రవీణ్‌రాజ్‌ సమాచారం రావడంతో సిబ్బంది రజనీకాంత్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాలని కోరినా స్పందన లేకపోవడంతో వారిద్దరే బయటకు తీశారు. అనంతరం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రతిఒక్కరూ పోలీసులకు సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ పెట్టారు. ఈ విషయం రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలియడంతో ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.  
చదవండి: తెలంగాణ: లాక్‌డౌన్‌ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే

మరిన్ని వార్తలు