‘జీ20 సదస్సు’కు సిద్దిపేట గొల్లభామ చీరలు

8 Sep, 2023 03:17 IST|Sakshi

సిద్దిపేట జోన్‌: దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సిద్దిపే­ట గొల్లభామ చీరలను ప్రదర్శించే అవకా­శం దక్కింది. వివిధ దేశాల ప్రధానులు, అ ధ్యక్షులు, ఇతర ముఖ్య ప్రతినిధులు హాజ రుకానున్న సదస్సు వేదిక వద్ద పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట  గొల్లభామ చీరలను కూడా ప్రత్యేక స్టాల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో సిద్దిపేట నేత న్నల నైపుణ్యం ప్రపంచానికి తెలి­య­నుం దని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఇలా రూపుదిద్దుకుంది..: కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థా­నం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేట­కు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య.. ఒకరోజు తమ ఇంటి ముందునుంచి తలమీద పాలకుండ, చేతిలో పెరుగు గురిగి పట్టుకొని నడిచి­వెళుతున్న ఓ మహిళ నీడను చూసి.. వారిలో ‘గొల్ల భామ‘చీరల ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడ వుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు ప్రత్యేకమైన సాంచాను తయారు చేసుకున్నారు.

అలా ఆవిష్కృతమైన అద్భు­తమే.. ‘గొల్లభామ చీర’గా ప్రశస్తి పొందింది. పట్టు, కాటన్‌.. రెండు రకాల్లోనూ ఈ చీరలను నేస్తారు. చీర అంచుల్లో వయ్యారంగా నడిచే గొల్లభామ చిత్రం వచ్చేలా నేయడమే వీటి ప్రత్యేకత. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు.

ఒకప్పుడు గొల్లభామ చీర తయారీకి వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడు జాకార్డు మగ్గం వల్ల మూడు, నాలుగు రోజుల్లో గొల్లభామ చీర తయారు చేస్తున్నారు. మిగతా చీరలతో పోలిస్తే ఈ చీరలను నేయడం కష్టంతో కూడుకున్న పనిగా చెపుతారు. 2012లో ఈ చీరలకు జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ లభించింది. 

మరిన్ని వార్తలు