ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. రఘునందన్‌ రావు ఏమన్నారంటే..

30 Oct, 2023 19:00 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా  దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో మెదక్‌  ఎంపీ, బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి  తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

పోలీసుల విచారణలో నిజానిజాలు
ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్‌ రిపోర్టర్‌ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని  తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు.

ప్రభాకర్‌రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా
 ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని  అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు.

సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు