-

కరోనా బారినపడితే 7 రోజుల సెలవులు 

18 Jan, 2022 04:32 IST|Sakshi

సింగరేణి సంస్థ డైరెక్టర్ల వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారిన పడిన సింగరేణి ఉద్యోగులకు వారం రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్నట్లు సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్, ఎన్‌.బలరామ్‌ వెల్లడించారు. కరోనా తొలి రెండో దశల్లో వైరస్‌ సోకిన ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 14 రోజుల ప్రత్యేక సెలవును ఇచ్చామని, మూడో దశలో కరోనా మార్గదర్శకాలను కేంద్రం సడలించిందని పేర్కొన్నారు. ఏడు రోజుల ఐసోలేషన్‌ తర్వాత కోలుకున్న ఉద్యోగులు విధుల్లోకి రావొచ్చని, కరోనా పరీక్షలు అవసరం లేదన్నారు.

సింగరేణిలో కరోనా పరిస్థితులపై సోమవారం కొత్తగూడెం నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వారు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 913 యాక్టివ్‌ కేసులుండగా, అందులో 382 మంది ఉద్యోగులు, 415 మంది కుటుంబ సభ్యులు, 116 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారని తెలిపారు. అన్ని ఏరియాలకు కావాల్సిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు, మందులు, హోం ఐసోలేషన్‌ కిట్లు, శానిటైజర్లను సమకూర్చుతున్నామని జనరల్‌ మేనేజర్‌ కె.సూర్యనారాయణ వివరించారు.

సమావేశంలో సింగరేణి భవన్‌ నుంచి జీఎం (స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌) జి.సురేందర్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఎన్‌.భాస్కర్, డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బాలకోటయ్య, కొత్తగూడెం నుంచి జీఎం (పర్సనల్‌), వెల్ఫేర్, సీఎస్‌ఆర్‌ కె.బసవయ్య, జీఎం(పర్సనల్‌), ఐఆర్, పీఎం అండ్‌ ఆర్సీ ఎ.ఆనందరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మంథా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు