శివరాత్రికి ఎములాడ సిద్ధం

28 Feb, 2022 02:48 IST|Sakshi
ఆదివారం రాత్రి విద్యుత్‌ కాంతుల్లో వెలుగులీనుతున్న వేములవాడ దేవాలయం 

నేటి నుంచి జాతర షురూ

2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

రూ. 2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు 

1,600 మంది పోలీసుల బందోబస్తు

వేములవాడ: పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 

రాజన్న చెంతకు చేరుకోండిలా..
రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్‌ నుంచి వచ్చేవారు కరీంనగర్‌ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు.

మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్‌ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్‌ రూ.15 చొప్పున విక్రయిస్తారు. 

రాజన్న జాతర పూజలు
మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్‌ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్‌ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు