కొత్త కరోనా టెన్షన్‌ :ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఆరుగురు

24 Dec, 2020 12:20 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇటీవల బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో ఎంత మందికి కరోనా వైరస్‌ సోకిందో తెలియక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.  బ్రిటన్‌ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరుగురు వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలానికి ముగ్గురు వచ్చారు. తల్లిదండ్రులతో పాటు వారి కూతురు.. యూకే నుండి వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. వీరి నుండి శాంపిల్స్ సేకరించారు. చదవండి: కరీంనగర్‌లో కొత్త వైరస్ కలకలం

ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ నుంచి నిర్మల్‌ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ వ్యాధి సోకలేదని జిల్లా వైద్యారోగ్యశాఖ గురువారం తెలిపింది. ఇద్దరి నుంచి సేకరించిన శాంపిల్స్‌ పరీక్షలలో నెగిటివ్‌ వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసకున్నామని నిర్మల్‌ జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ తెలిపారు. విదేశాల నుంచి కరోనా సోకిన వాళ్లు ఎవరూ రాలేదని అన్నారు. యూఎస్‌ నుంచి ఆదిలాబాద్‌ వచ్చిన ఒక వ్యక్తి మళ్లీ పుణె వెళ్లిపోయారన్నారు. కొమురంభీం జిల్లా దహేగామ్‌కు ముగ్గురు ఇంగ్లాండ్‌ నుంచి వచ్చారని, మంచిర్యాల జిల్లాకు ఒకరు వచ్చారన్నారు.

లండన్‌ నుంచి ఒకరు రాక
ఆదిలాబాద్‌టౌన్‌: లండన్‌ నుంచి ఈనెల 9న ఒకరు జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి వచ్చినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. కాగా బ్రిటన్‌లో ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన వివరాలు సేకరించారు. సదరు వ్యక్తి ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేసుకోగా నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌ఓ వివరించారు. 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న ఆయనకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో ప్రస్తుతం ఆయన పూణెకు వెళ్లారని చెప్పారు. జిల్లా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని వివరించారు.   

కాగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విస్తరిస్తుండటంతో వారం రోజుల్లోనే కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. డిసెంబర్‌ 31, నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. తాజా వైరస్‌ ముప్పుపై బ్రిటన్‌ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌ కూడా బుధవారం నుంచి డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. 

మరిన్ని వార్తలు