నల్లమలలో స్వల్పంగా కంపించిన భూమి

27 Jul, 2021 03:33 IST|Sakshi

అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి కదలడంతో ఏమి జరుగుతుందో తెలియక జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌కు 35 కి.మీ. ఎగువన ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. భూగర్భంలో ఏడు నుంచి 10 కిలోమీటర్ల లోతు నుంచి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.

మరిన్ని వార్తలు