ఫ్లై ఓవర్ల కింద స్మార్ట్‌ పార్కింగ్‌.. ప్రస్తుతానికి వీరికే అవకాశం  

12 Jul, 2021 08:14 IST|Sakshi

పే అండ్‌ పార్క్‌ పద్ధతి అమలు

వాహనాలకు భద్రత.. జీహెచ్‌ఎంసీకి ఆదాయం

పైలట్‌గా కూకట్‌పల్లిలో.. దశలవారీగా మిగతా ప్రాంతాల్లో

వృద్ధులు, మహిళలకు ప్రయోజనం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో పార్కింగ్‌ అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో కొత్త పార్కింగ్‌ సిస్టమ్స్‌ అందుబాటులోకి తెస్తామని నేతలు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓవైపు ప్రజలకు సదుపాయంతో పాటు మరోవైపు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకొని జీహెచ్‌ఎంసీకి ఆదాయం కూడా సమకూరేలా స్మార్ట్‌పార్కింగ్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. గ్లోబల్‌సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ పార్కింగ్‌ సిస్టమ్‌తో గందరగోళం ఉండదు.

వేచి ఉండాల్సిన పరిస్థితులుండవు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సౌకర్య వంతంగా ఉంటుంది. వీరి కోసం కొన్ని స్లాట్స్‌ రిజర్వుగా  ఉంటాయి. యాప్‌లోనే ముందస్తుగా స్లాట్‌ బుకింగ్‌ అవకాశం ఉండటంతో దూరం నుంచి వచ్చేవారికి సదుపాయం. ఆన్‌లైన్‌ పేమెంట్‌ విధానంతో ‘చిల్లర’ గొడవలుండవు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లోని సుజనా ఫోరం మాల్‌ ఎదుట ఫ్లైఓవర్‌ కింద వాహనాలు పార్కింగ్‌ చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు.. ఆ స్థలంలోనే స్మార్ట్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే  స్మార్ట్‌ పార్కింగ్‌. పీపీపీ విధానంలో పనులు పూర్తయ్యాయి.  త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది.  

ప్రత్యేకతలివీ..  
పార్కింగ్‌ ప్రదేశంలోనే అయినా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్‌ చేయడం కుదరదు. పార్కింగ్‌ ప్రదేశానికి గేట్‌వేతో పాటు బొల్లార్డ్స్, సెన్సార్లు ఉండటంతో నిరీ్ణత ప్రదేశంలోనే పార్కింగ్‌ చేస్తారు. వాహనం వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు స్కానింగ్‌ జరుగుతుంది. వాహనం పోతుందనే.. దొంగల భయం ఉండదు. వాహనాల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఏడాది వరకు క్లౌడ్‌ స్టోరేజిలో ఉంటాయి. జీహెచ్‌ఎంసీకి  ఆదాయం లభిస్తుంది. సిస్టమేటిక్‌ పార్కింగ్‌తో రద్దీ సమయాల్లో రోడ్లపై  ట్రాఫిక్‌జామ్‌ తగ్గుతుంది. గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో çపర్యావరణ పరంగా మేలు. పైలట్‌ ప్రాజెక్టుగా దీని అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్నింటినీ అనుసంధానం చేసే వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచనలున్నాయి.  

మరిన్ని వార్తలు