మనోళ్లు ‘స్మార్ట్‌’గా అడిక్ట్‌!.. ఫోన్, యాప్స్‌కు బానిసలుగా..

22 Jan, 2023 02:38 IST|Sakshi

2022లో సగటున రోజుకు 5 గంటల పాటు మొబైల్స్‌తోనే కాలక్షేపం 

ఏకంగా 28.8 బిలియన్ల యాప్‌ డౌన్‌లోడ్లతో ప్రపంచంలోనే రెండోస్ధానం 

రెండింతలు పెరిగిన ఫ్రెండ్‌షిప్, డేటింగ్‌ యాప్‌ల వినియోగం 

ఈ యాప్స్‌పై 9.9 మిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ.81 కోట్లు) ఖర్చు 

యాప్‌ ఆనీ (డేటా.ఏఐ) ‘స్టేట్‌ ఆఫ్‌ ద మొబైల్‌ రిపోర్ట్‌–2023’ నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో స్మార్ట్‌ ఫోన్లు, మొబైల్‌ యాప్స్‌ (అప్లికేషన్స్‌) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫోన్‌ వినియోగం అడిక్షన్‌ స్థాయికి చేరుతోంది. 2022 ఏడాదిలో భారత యూజర్లు రోజుకు సగటున ఐదు గంటల పాటు మొబైల్స్‌తోనే కాలక్షేపం చేశారు. ఆ ఏడాదికాలంలో ఏకంగా 28.8 బిలియన్ల యాప్‌ డౌన్‌లోడ్లు చేసి.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు.

111 బిలియన్ల డౌన్‌లోడ్లతో చైనా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. వివిధ మొబైల్‌ యాప్స్‌లో సమయం గడుపుతున్న విషయంలోనూ భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అందరూ కలిపి గతేడాది మొత్తం 0.74 ట్రిలియన్‌ గంటలు (74 వేల కోట్ల గంటలు) మొబైల్స్‌లోనే కాలం గడిపారు. ‘యాప్‌ ఆనీ (ఇటీవలే డేటా.ఏఐగా పేరు మారింది)’ ఇటీవల విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ద మొబైల్‌ రిపోర్ట్‌–2023’ నివేదికలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలోనూ బిజీగా.. 
షాపింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ కొనుగోళ్లలోనూ భారతీయులు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ యూజర్లు మొత్తంగా 110 బిలియన్ల గంటలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో గడపగా.. అందులో భారతీయులు గడిపిన సమయం 8.7 బిలియన్లు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్‌లోడ్‌ చేసిన పది ఫైనాన్స్‌ యాప్‌లలో ఐదు  (పేటీఎమ్, గూగుల్‌పే, బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ యోనో యాప్‌) మన దేశంలోనే ఉన్నాయి.

ఇక కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. 2022లో ఇండియన్ల ఫ్రెండ్‌షిప్, డేటింగ్‌ యాప్‌ల వినియోగం రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది. గతేడాది ఈ యాప్స్‌పై 9.9 మిలియన్‌ డాలర్ల (2021లో 4.5 మిలియన్‌ డాలర్లు) మేర ఖర్చు చేసినట్టు అంచనా.  

కల్పిత రిలేషన్‌షిప్‌లు.. మోసాలు.. 
మొబైల్స్, యాప్స్‌ వినియోగానికి అలవాటుపడ్డవారు తమకు అంతగా పరిచయం లేనివారి నుంచి కూడా పరోక్ష సాంత్వన కోరుకుంటున్నారు. యాప్స్‌తో పరిచయమయ్యేవారు నిజ స్వరూపాన్ని దాచి, కల్పిత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. అమాయకత్వం నుంచి క్రిమినల్‌ బిహేవియర్‌ ఉన్న వారిదాకా తమ పద్ధతుల్లో ఈ యాప్స్‌ను ఉపయోగించడమో, దుర్వినియోగం చేయడమో జరుగుతోంది. ఈ దుష్ప్రభావాలను గుర్తెరిగి ప్రవర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 
– డాక్టర్‌ నిశాంత్‌ వేమన, సైకియాట్రిస్ట్, సన్‌షైన్, చేతన హాస్పిటల్స్‌ 

జనంలో బద్ధకం పెరిగిపోతోంది 
విపరీతంగా మొబైల్, యాప్స్‌ వినియోగంతో జనంలో బద్ధకం పెరిగిపోతోంది. బంధువులు, స్నే హి­తులు, సన్నిహితులను కలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూ పడం లేదు. ఊబకాయులు, మ­ధు­మేహ పీడితులు, ఇతర అనారోగ్యాల బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. ఇది రాబో­యే రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. వివిధ యాప్‌ల వినియోగం విషయంలో ప్రభుత్వపరంగా రెగ్యులేటరీ విధా­నం ఉండాలి. స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఈ యాప్‌లపై  అవగాహన కల్పించాలి.    
–సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు