వ్యాపారానికి అద్వితీయం.. జాబితాలో ద్వితీయం..

31 Aug, 2023 03:21 IST|Sakshi

దేశంలోని హైస్ట్రీట్‌లలో సోమాజిగూడకు రెండోస్థానం

నరెడ్కో–నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్, గేమింగ్‌ జోన్స్, రిటైల్‌ షాపులు, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్నీ గుదిగుచ్చి ఓ వ్యాపారకూడలిగా మారే ప్రాంతాలను హైస్ట్రీట్స్‌గా పిలుస్తున్నారు. కాస్మోపాలిటన్‌ సిటీలకు ఈ హైస్ట్రీట్సే ఆకర్షణ. పగలు అందమైన ఆకాశహర్మ్యాలు, రాత్రిళ్లు నియాన్‌లైట్ల వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఈ హైస్ట్రీట్స్‌కు వెళ్తే ‘‘ఎంతహాయి ఈ నగరమోయి..ఎంత అందమోయి ఈ నగరమోయి’’అని పాడుకోవాల్సిందే మరి.

నగరంలో ఎక్కడ్నుంచైనా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం, ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ హైస్ట్రీట్‌లలో ప్రతి చదరపు అడుగుల ఆదాయం షాపింగ్‌ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. హైస్ట్రీట్‌లో చదరపు అడుగుల ఆదాయం ఏడాదికి సుమారు రూ.36.42 లక్షలు కాగా..షాపింగ్‌ మాల్స్‌లో రూ.11.31 లక్షలుగా ఉంటుంది.

ఖరీదైన ప్రాంతంగా జూబ్లీహిల్స్‌
నగరంలోని ఐదు ప్రాంతాలలో రిటైల్‌ అద్దెల పరంగా అతి ఖరీదైనప్రాంతం మాత్రం జూబ్లీహిల్సే. ఇక్కడ చదరపు అడుగు రిటైల్‌ స్పేస్‌ సగటు అద్దె నెలకు రూ.200–225 కాగా, దాని తర్వాత బంజారాహిల్స్‌ (రూ.190–230), సోమాజిగూడ (రూ.150–175), అమీర్‌పేట (రూ.110–130), గచ్చిబౌలి ప్రాంతాలు రూ.140గా ఉన్నాయి.

హైస్ట్రీట్స్‌ జాబితాలో రెండోస్థానంగా సోమాజిగూడ...
కాస్మోపాలిటన్‌ సిటీల్లోని హైస్ట్రీట్‌లపై ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌ విజన్‌–2047’పేరుతో నరెడ్కో–నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ హైస్ట్రీట్‌ రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఈ నివేదికలో బెంగళూరులోని ఎంజీ రోడ్‌ తొలిస్థానంలో నిలిచింది. దేశంలోని టాప్‌ 20 హైస్ట్రీట్స్‌ జాబితాలో హైదరాబాద్‌ నుంచి సోమాజిగూడతోపాటు ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్‌ 17, బంజారాహిల్స్‌ 18, జూబ్లీహిల్స్‌ 19వ స్థానంలో నిలిచాయి. 

ఆధునిక రిటైల్‌ హైస్ట్రీట్స్‌ లో ఎన్‌సీఆర్‌దే అగ్రస్థానం
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 హైస్ట్రీట్స్‌ ఉండగా...ఈ హైస్ట్రీట్స్‌ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్‌ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్‌ ప్రాంతంలోని ఎన్‌సీఆర్‌ తొలిస్థానంలో ఉండగా..18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్‌ మలిస్థానంలో నిలిచింది.

ఇక అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్‌ స్పేస్‌ పరంగా చూస్తే...ఎనిమిది ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా..14 లక్షల చదరపు అడుగులతో ఎన్‌సీఆర్‌ అగ్రస్థానంలో, 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచాయి.

మరిన్ని వార్తలు