Kishan Reddy: ఆ ఓటమితోనే కలిసొచ్చిన అదృష్టం 

8 Jul, 2021 10:46 IST|Sakshi

కిషన్‌రెడ్డికి జాక్‌పాట్‌

మోదీ టీమ్‌లో కీలక స్థానం

కేంద్ర కేబినెట్‌లో దక్కిన బెర్త్‌  

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు గంగాపురం కిషన్‌రెడ్డి జాక్‌పాట్‌ కొట్టారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనా.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల ఆదరణ చూరగొన్న కిషన్‌రెడ్డి.. ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంతో రెండేళ్లలోనే కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందారు.

గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ కేంద్రంలో పదవులు నిర్వర్తించినా.. సహాయ మంత్రి హోదాకే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించడం కూడా కిషన్‌రెడ్డి ప్రమోషన్‌కు కలిసొచ్చిన అంశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి పరిచయాలు ఉండడం ఆయనకు ప్లస్‌ పాయింటైంది. సున్నిత మనస్తత్వం.. కార్యకర్తలతో మమేకం కావడం కూడా ఆయనకు ఎదుగుదలకు కారణంగా చెప్పవచ్చు. 

మార్నింగ్‌ వాక్‌తో మమేకం.. 
కిషన్‌రెడ్డి మొదటి నుంచీ మార్నింగ్‌ వాక్‌తో ప్రజలతో మమేకమయయ్యేవారు. కోవిడ్‌ ఉద్ధృతి సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్‌ ఆస్పత్రుల్లో పర్యటించారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొరతను నివారించారు. వివాదరహితుడిగా కిషన్‌రెడ్డికి పేరుంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ.. కోవిడ్‌ ఇతర కారణాలతో చనిపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించేవారు. బీజేపీ సీనియర్‌ నేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావులతో సన్నిహితంగా ఉండి వారి విశ్వాసాన్ని చూరగొన్నారు. వారి మార్గదర్శకత్వంలోనే నగరంలో పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డారు. ఒదిగి ఉండటంతోనే ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు.      

అదృష్టం తలుపుతట్టింది
లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్, వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌రెడ్డి.. విద్యార్థి దశలోనే అప్పటి జనతా పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చదువు కొనసాగించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో కార్వాన్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2004 హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభన తర్వాత అంబర్‌పేట నుంచి 2009, 2014లలో రెండుసార్లు గెలుపొందారు.

2018లో ఇదే స్థానం నుంచి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాలుగోసారి అనూహ్యంగా ఓటమిని చవిచూసిన ఆయనకు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడమే తరువాయి అమాత్య పదవి వరించింది. మోదీ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో పూర్తిస్థాయి కేబినెట్‌ హోదా లభించడంతో రాష్ట్ర బీజేపీ కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. ఆయనకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను అప్పగించారు.  

మరిన్ని వార్తలు