జలమండలికి ప్రత్యేక టారిఫ్‌

26 Feb, 2021 04:48 IST|Sakshi

పాత టారిఫ్‌ను పునరుద్ధరించడం కుదరదు

త్వరగా టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పిస్తే తుది నిర్ణయం

జలమండలికి విద్యుత్‌ సరఫరా కట్‌ చేయొద్దు

డిస్కంలకు ఈఆర్సీ ఆదేశం..  

సాక్షి, హైదరాబాద్‌: జలమండలికి సంబంధించిన విద్యుత్‌ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్‌ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్‌ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది.

ప్రత్యేక టారిఫ్‌ అమలుతో గతేడాది జూన్‌ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్‌ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు