టీఎస్‌పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా?

23 Feb, 2021 01:03 IST|Sakshi

కొలువుల భర్తీకి ‘కోరం’ ఏది!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో కుర్చీలు ఖాళీ

రెండు నెలలుగా ఇన్‌చార్జి చైర్మన్‌తో కొనసాగింపు

ఈ నెలతో ఇన్‌చార్జి చైర్మన్‌ సైతం పదవీ విరమణ

టీఎస్‌పీఎస్సీలో మిగిలేది ఒకేఒక్కడు

చైర్మన్, సభ్యుల నియామకంపై అయోమయం

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే కమిషన్‌ కార్యాలయంలో ఖాళీలు ఏర్పడ్డాయి. రెండు నెలలుగా అవి భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకపాత్ర పోషించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరిస్థితి. గతేడాది డిసెంబర్‌లో కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణితోపాటు ఇద్దరు సభ్యులు సి.విఠల్, చంద్రావతి పదవీకాలం పూర్తయింది. దీంతో మిగిలిన ఇద్దరు సభ్యులు కృష్ణారెడ్డి, సాయిలు మాత్రమే కొనసాగుతున్నారు.

వీరిలో ఇన్‌చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. తాజాగా కృష్ణారెడ్డి ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీలో కేవలం ఒక్కరు మాత్రమే మెంబర్‌గా కొనసాగనున్నారు. ఒక్క సభ్యుడితో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొనసాగింపు అనేది మున్ముందు అయోమయంగా మారనుంది. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఉద్యోగాలభర్తీకి సన్నద్ధమవుతున్న వేళ కమిషన్‌లో సభ్యులు లేకపోవడంతో నియామకాలపై సందిగ్ధత ఏర్పడే అవకాశముంది.

కోరం ఉంటేనే నోటిఫికేషన్లు...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగ ప్రకటనలు వెలువడాలంటే చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు తప్పకుండా ఉండాలి. వారి ఆమోదంతోనే నోటిఫికేషన్లు విడుదల చేసేలా నిబంధనలున్నాయి. కానీ, ప్రస్తుతం ఇద్దరుసభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒకరు ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉండగా, మరొకరు మాత్రమే సభ్యుడిగా కొనసాగుతుండటంతో ఇప్పటికిప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేదని కమిషన్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే శాఖలవారీగా ఉన్న ఖాళీలు, ప్రాధాన్యతల ప్రకారం భర్తీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.

మంజూరైన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీలను లెక్కిస్తూ శాఖలవారీగా అంచనాలపై ఆర్థికశాఖ స్పష్టమైన నివేదికను తయారు చేసి ఉంచింది. ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ప్రభుత్వం ఉద్యోగఖాళీల భర్తీకి ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ల విడుదల కోరం మాత్రం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా... అందులో అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాలలో చేరిపోయారు. మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు