11 ‘విద్యుత్‌’ ఒప్పందాలకు ఓకే

9 Aug, 2021 03:17 IST|Sakshi

జెన్‌కో, డిస్కంల మధ్య పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం

యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై నిపుణుల అభ్యంతరాలు

అనవసర వ్యయాన్ని అనుమతించొద్దని ఈఆర్సీకి సూచన

పెరిగిన వ్యయాన్ని సమర్థించుకున్న జెన్‌కో

నిర్మాణం పూర్తయ్యాక తుది వ్యయంపై నిర్ణయం: ఈఆర్స

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో), విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య జరిగిన 11 పాత, కొత్త విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సుమోటోగా ఆమోదించింది. జెన్‌కో కొత్తగా నిర్మించిన/నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల కేటీపీఎస్‌–7వ దశ, 600 మెగావాట్ల కేటీపీపీ–2, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంతో సంస్థకు చెందిన ఇతర పాత విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల కోసం తెలంగాణ ఆవిర్భావం తర్వాత డిస్కంలు పీపీఏలను కుదుర్చుకున్నాయి. విద్యుత్‌ చట్టం–2003 నిబంధనల ప్రకారం ఈ పీపీఏలను ఈఆర్సీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఏలపై బహిరంగ విచారణ నిర్వహించి వివిధ వర్గాల నుంచి సలహాలను ఈఆర్సీ స్వీకరించింది. అనంతరం పలు మార్పులతో పీపీఏలను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గడువు తీరిన పీపీఏల స్థానంలో కొత్త ఒప్పందాలు 
1956 నుంచి 1998 మధ్య పాత థర్మల్, హైడల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లకు జరిగిన పీపీఏల వ్యవధి 2019లో ముగిసింది. దీంతో 400 మెగావాట్ల కేటీపీఎస్‌ ఏబీసీ, 500 మెగావాట్ల కేటీపీఎస్‌–5వ దశ, 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్‌ స్టేషన్‌–బీ, 875.6 మెగావాట్ల నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం, 54 మెగావాట్ల సింగూరు/పోచంపాడు/పాలేరు/నిజాంసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాలు, 9.16 మెగావాట్ల పెద్దపల్లి జలవిద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల కోసం డిస్కంలు జెన్‌కోతో కొత్త పీపీఏలు చేసుకున్నాయి. ఈ పీపీఏలను సైతం ఈఆర్సీ తాజాగా ఆమోదించింది.  

యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై అభ్యంతరాలు
నిర్మాణంలో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వ్యయం భారీగా పెరిగిపోతోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణవ్యయం రూ. 30 వేల కోట్లకు పెరగనుందని జెన్‌కో అంచనా వేసింది. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ వ్యయం సైతం రూ. 8,536 కోట్లకు పెరగనుందని ఈఆర్సీకి తెలిపింది. 800 మెగావాట్ల కేటీపీఎస్‌– 7వ దశ నిర్మాణానికి రూ. 5,548.44 కోట్లు, 600 మెగావాట్ల కేటీపీపీ–2కు రూ. 4,334 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది.

భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరగడంపట్ల వాటి పీపీఏలపై ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం భూసేకరణ, పునరావాసం కోసం రూ. 845 కోట్లు, ప్రాజెక్టు ప్రదేశానికి యంత్ర పరికరాలను తరలించడం, అమర్చడం వంటి పనుల కోసం రూ. 1,617 కోట్లు, సివిల్‌ వర్క్స్‌ కోసం రూ. 5,057 కోట్లు, కంటిజెన్సి కింద రూ. 201 కోట్లను జెన్‌కో అనవసరంగా ఖర్చు చేసిందని, ఈ వ్యయాలను అనుమతించరాదని ఈఆర్సీని కోరారు. నిబంధనల మేరకే ఖర్చులు చేసినట్లు జెన్‌కో సమర్థించుకోగా విద్యుత్‌ కేంద్రాల నిర్మా ణం పూర్తయ్యాక రానున్న వాస్తవ వ్యయంపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ పేర్కొంది.   

మరిన్ని వార్తలు