కరోనాతో మృతి.. టీకా వేసుకుంటే బతికేవాడేమో..

24 Dec, 2021 09:04 IST|Sakshi
దబ్బెట మహేశ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, కుటుంబీకులు

సాక్షి, వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని సుబేదారి యూనివర్సిటీ పీజీ కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ దబ్బెట మహేశ్‌(39) గురువారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. మహేశ్‌కు నెల క్రితం కరోనా సోకింది. ఆయనను వరంగల్‌ ఎంజీఎంలో చేర్పించారు. కొద్దిరోజులకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. కానీ ఊపరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మహేశ్‌ కేయూలో రాజనీతి శాస్త్రం పీజీతో పాటు పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేశారు. కేయూ పార్ట్‌ టైం లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. మహేశ్‌ మృతితో కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు, సహచర పార్ట్‌టైం లెక్చరర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేయూ ఎస్‌డీఎల్‌సీఈ మాజీ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్, కేయూ అబివృద్ధి అధికారి రాంచంద్రం, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రి, వివిధ సంఘాల బాధ్యులు నివాళులర్పించారు

సంతాపం
కేయూ ఫ్రొఫెసర్లు దినేశ్‌కుమార్, రామచంద్రం, ఓయూ, కేయూ జేఏసీ నాయకులు సాదురాజేశ్, దుర్గం సారయ్య, విజయ్‌ఖన్నా, స్టాలిన్, విజయ్, పృద్వీ, మోహన్‌రాజ్, సోమలింగం, నర్సింహారావు, శ్రీధర్, నివాస్, దేవోజీ నివాళులు అర్పించారు. కేయూ మొదటి గేట్‌ వద్ద మహేశ్‌ చిత్రపటానికి ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కేయూ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కొంగర జగన్‌ మహేశ్‌ చిత్రపటానికి  పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

స్వగ్రామంలో విషాదం
కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బెట సీతయ్య, కాంతమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేశ్, చిన్న కుమారుడు శ్రీను. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి చెందాడు. ప్రస్తుతం కరోనా కాటుకు మహేశ్‌ బలవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలిచివేశాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన మహేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఓయూ, కేయూ జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల బాధ్యులు కోరుతున్నారు. 

టీకా వేసుకుంటే బతికేవాడేమో..
మహేశ్‌ ఉన్నత విద్యావంతుడై ఉండి టీకా ఎందుకు వేసుకోలేదు అనే ప్రశ్న అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కరోనాను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గమని ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చైతన్య పరుస్తున్నారు. టీకా వేసుకొని ఉంటే బతికేవాడేమో అని అంతిమయాత్రలో పాల్గొన్న వారు చర్చించుకున్నారు.

చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వల.. లాంగ్‌ డ్రైవ్‌ పేరుతో కిడ్నాప్‌

మరిన్ని వార్తలు