అత్త రేఖా నాయక్‌ ఎఫెక్ట్‌.. మహబూబాబాద్‌ ఎస్పీ ఆకస్మిక బదిలీ 

29 Aug, 2023 05:57 IST|Sakshi
శరత్‌చంద్ర పవార్‌

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ గుండేటిని నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్‌ ఎఫెక్ట్‌’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్‌ రాకపోగా, ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం.

మరిన్ని వార్తలు