గూగుల్‌ హ్యాక్‌ ఫర్‌ చేంజ్‌ విజేత ‘టీమ్‌ అగ్రి హీరోస్‌’

26 Aug, 2023 01:40 IST|Sakshi
గూగుల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ గురు భట్‌తో టీమ్‌ అగ్రిహీరోస్‌

ద నడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్, టీ–హబ్‌ సంయుక్తంగా హ్యాకథాన్‌ నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్‌ అగ్రిహీరోస్‌’.. గూగుల్‌ ‘హ్యాక్‌ 4 చేంజ్‌’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, టీ–హబ్‌ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్‌ జరిగింది.

దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్‌ అగ్రిహీరోస్‌’తొలిస్థానంలో నిలిచింది.

ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్‌ డీప్‌.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. 

‘టీమ్‌ లైట్‌హెడ్స్‌’కి మూడో బహుమతి  
కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్‌ ప్రవీణ్‌ కుమార్, గూగుల్‌ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ (ఇంజనీరింగ్‌) గురు భట్, ప్రిన్సిపల్‌ ఇంజనీర్‌ అరుణ్‌ ప్రసాద్‌ అరుణాచలం, టీ–హబ్‌ సీఓఓ వింగ్‌ కమాండర్‌ ఆంటోని అనీశ్, ద నడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్‌ ఇన్‌ఫెర్నోస్‌’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది.

వ్యవసాయంలో ఆల్టర్నేట్‌ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్‌ లైట్‌హెడ్స్‌’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది.

మరిన్ని వార్తలు