డ్యామిట్‌.. కేసీఆర్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఇప్పుడేం చేస్తారో?

26 Dec, 2022 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫామ్‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌ సర్కార్‌కు గట్టి  ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి.. ఆ దర్యాప్తు ద్వారా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలని తీవ్రంగా యత్నించింది బీఆర్‌ఎస్‌ అండ్‌ కో. కానీ, కేసును సీబీఐకి అప్పగించాలన్న ఇవాళ్టి  తెలంగాణ హైకోర్టు తీర్పుతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. 

కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తే.. కేసు నిర్వీర్యం అయిపోతుందని, ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశం కోల్పోతామేమో అనే ఆందోళన చెందుతోంది బీఆర్‌ఎస్‌. కోర్టు తీర్పు వెలువరిన వెంటనే.. ఆ తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ బీజేపీ నేత, అడ్వొకేట్‌ రామచంద్ర రావ్‌ ప్రకటన చేయడం గమనార్హం. సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆయన వాదించారు. అంతకు ముందు.. ఈ కేసులో కుట్రకోణం దాగుందని, సంబందం లేని వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు.

తెలంగాణ రంగారెడ్డి పరిధిలోని మొయనాబాద్‌లోని ఓ ఫామ్‌ హౌజ్‌లో అక్టోబర్‌ 26వ తేదీ సాయంత్రం ఆకస్మిక సోదాలు నిర్వహించిన సైబరాబాద్‌ పోలీసులు.. బీఆర్‌ఎస్‌(పాత టీఆర్‌ఎస్‌) ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా వంద కోట్ల రూపాయలతో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరిగిందని ప్రకటించి సంచలనానికి తెర తీసింది. ఈ కేసులో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రామచంద్ర భారతి, సింహయాజులు, నంద కుమార్‌ల పేర్లను  నిందితులుగా చేర్చింది ఆ బృందం. ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్నది తెలిసిందే.

ఈ క్రమంలో.. అధికార ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వ్యవహారం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వచ్చారు. మరోవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం సాక్ష్యాలంటూ వీడియో ఫుటేజీలతో.. మీడియా ముందుకు వచ్చి బీజేపీ బడా నేతలను సైతం ఇందులో భాగం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని విమర్శిస్తూనే.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సిట్‌ విచారణలో భాగంగా నిందితుల అరెస్ట్‌.. ఆపై బెయిల్‌.. ఆ వెంటనే వేర్వేరే కేసుల్లో నిందితులను మళ్లీ అదుపులోకి తీసుకోవడం.. ఇలా హైడ్రామా నడిచింది.   

ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఉన్నత న్యాయస్థానం.. సుదీర్ఘ వాదనల తర్వాత టెక్నికల్‌ గ్రౌండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో నగదు లేనప్పుడు ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ ఎలా వర్తిస్తుందని, పైగా సీఎం కేసీఆర్‌ నేరుగా ఇన్‌వాల్వ్‌ అయ్యారని, అసలు దర్యాప్తు ఆధారాలు ఆయన చేతికి ఎలా వెళ్లాలని, అసలు ఏసీబీ చేయాల్సిన దర్యాప్తును సిట్‌ ఎలా చేస్తుందని?, సీబీఐకి అప్పగిస్తే అసలు వ్యవహారం బయటపడుతుందని.. ఇలా పిటిషనర్‌ తరపు వాదనలన్నీ తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అందుకే.. సిట్‌ ఏర్పాటును రద్దు చేస్తూ సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశించింది.  

ఒకవేళ రాష్ట్రంలో సీబీఐని నిషేధించినా.. హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు సింగిల్‌  బెంచ్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్‌ అనుకుంటోంది. దీంతో.. సిట్‌ అభ్యర్థనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

కేసులో కీలక పరిణామాలు

October 26 - తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

November 25 - హైకోర్టు జడ్జీలు బదిలీ

December 1 - నిందితులకు బెయిల్ మంజూరు

December 26 - కేసు సీబీఐకి అప్పగింత
 

మరిన్ని వార్తలు