నీళ్లను ఆంధ్రాకు అమ్మేశారు

7 Jul, 2021 04:22 IST|Sakshi

తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టారు 

సీఎం కేసీఆర్‌పై బీజేపీ 

అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదటి నినాదమైన నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ నంబర్‌ 1 ద్రోహిగా  కేసీఆర్‌ నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అపెక్స్‌ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేశారని, ఏ సోయితో కేసీఆర్‌ ఒప్పుకున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ల కేటాయింపులు, ప్రాజెక్ట్‌ల విషయంలో తాము చెప్పిన విషయాలపై శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేసీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తాము చెప్పినవి తప్పయితే ముక్కు నేలకు రాయడమే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లలో దూకి చావడానికి సిద్ధమన్నారు. వాస్తవాలని నిరూపిస్తే.. కేసీఆర్‌ తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం కంటే ఏడాది ముందే పాలమూరు–రంగారెడ్డి పనులకు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మ కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు.
 
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించాలి... 

దళిత సాధికారత సమావేశంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం తక్షణమే పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సంజయ్‌ను కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కళ్యాణ్‌ నాయక్‌ మంగళవారం కలిశారు. పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, సీఎంకు కళ్యాణ్‌నాయక్‌ పంపించిన వినతిపత్రం ప్రతులను జతచేసి సీఎంకు సంజయ్‌ లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు