పేదలకు నిలువ నీడా దక్కట్లేదు: ఆర్‌ఎస్పీ

10 May, 2022 01:52 IST|Sakshi

ములకలపల్లి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ పాలనలో నిరుపేదలకు నిలువ నీడ కూడా దక్కట్లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి, అన్నపురెడ్డి మండలాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల దోపిడీ, రాజ్యాధికారం లేక బహుజనులు నష్టపోతున్న తీరును 5 వేల గ్రామాల్లో వివరించేందుకు యాత్ర చేపట్టగా ఇప్పటివరకు 500 గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. ఉచిత పథకాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డబుల్‌ బెడ్రూమ్‌ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్రా కామేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు